విద్యార్థుల హక్కుల కోసం దేశవ్యాప్తంగా సాగుతున్న నిరసన జ్వాలలు మరింత తీవ్రరూపం దాల్చాయి. తాజాగా జరిగిన నిరసన కార్యక్రమం భారీ ఎత్తున విజయవంతం కావడంతో ప్రజా ఉద్యమం రోజురోజుకూ బలపడుతోందని సామాజిక కార్యకర్త, యువ నాయకుడు అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. జైపూర్‌లో ఇటీవల తనపై జరిగిన దాడిపై స్పందిస్తూ, ఇది కేవలం విద్యార్థుల ప్రధాన సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి మరియు తమను భయపెట్టడానికి చేసిన కుట్ర మాత్రమేనని ఆయన కొట్టిపారేశారు.
ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించిన నిరసన కార్యక్రమాలు ఊహించని స్థాయిలో విజయవంతమయ్యాయని అభిజిత్ దీప్కే సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థుల కోసం తాము చేపట్టిన శాంతియుత ప్రజా ఉద్యమానికి ప్రజల నుండి విద్యార్థి లోకం నుండి రోజురోజుకూ మద్దతు పెరుగుతోందని… ఇది ఒక పెద్ద ప్రజా సంకల్పంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు.
జైపూర్‌లో తనపై జరిగిన భౌతిక దాడి గురించి ప్రస్తావిస్తూ…అవతలి వైపు వారు ఎంతటి హింసకు దిగినా తాము వెనకడుగు వేసే ప్రసక్తి లేదని అభిజిత్ దీప్కే కుండబద్దలు కొట్టారు. మమ్మల్ని పది సార్లు కొట్టినా, ఎన్ని రకాలుగా మానసికంగా, శారీరకంగా వేధించినా మా లక్ష్యం మారదు. మాపై జరిగిన దాడి కేవలం మమ్మల్ని భయపెట్టడానికి మరియు అసలు సమస్యను పక్కదారి పట్టించడానికి చేసిన విఫల ప్రయత్నం మాత్రమేనని తేల్చిచెప్పారు.
Also Read:‘సింగ్ గీతం’పై ఎన్టీఆర్ ప్రశంసలు
దాదాపు కోటి మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అన్యాయానికి నైతిక బాధ్యత వహిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని అభిజిత్ దీప్కే డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు మరియు మంత్రి రాజీనామా చేసేంత వరకు ఈ పోరాటం ఆగేది లేదని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఉద్యమకారులకు, విద్యార్థులకు ఆయన ఒక కీలక విజ్ఞప్తి చేశారు. అవతలి పక్షం ఎంత హింసకు ప్రేరేపించినా, మన వైపు నుండి మాత్రం నిరసనలు పూర్తిగా శాంతియుత మార్గంలోనే సాగాలని పిలుపునిచ్చారు.

