హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సు వేదికైంది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సదస్సు మూడు రోజుల పాటు జరగనుంది. జనవరి 18 నుండి 20వ తేదీ వరకు హైదరాబాద్ నోవాటెల్‌లో జరిగే ఈ సదస్సుకు ‘గాంధేయ మార్గంలో సుస్థిర అభివృద్ధి, ఆవిష్కరణలు’ పేరు పెట్టారు.
శుక్రవారం ఏర్పాటు చేసిన ఆతిథ్య సమావేశంలో వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు సదస్సు లక్ష్యాలను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత వివరించారు. గాంధేయ మార్గంలో సుస్థిర అభివృద్ధి సాధనతో పాటు నూతన ఆవిష్కరణల కోసం సదస్సులో యువ నాయకులు చర్చించాలని కోరారు.
110 దేశాల నుంచి 500కు పైగా ప్రతినిధులు సదస్సులో పాల్గొనేందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. సదస్సులో పాల్గొనేందుకు ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే శుక్రవారమే హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు కవిత సాదర స్వాగతం పలికారు.అన్నా హాజారేతో పాటు ప్రత్యేక అతిథిగా సార్క్ మాజీ సెక్రటరీ జనరల్ అర్జున్ బహదూర్ థాపా హాజరు కానున్నారు.
20వ తేదీ ముగింపు సమావేశానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ హాజరు కానున్నారు. మొత్తం 135 దేశాల నుండి 550 మంది ప్రతినిధులు పాల్గొంటారు. 16 దేశాల నుండి 70 మంది వక్తలు, 40 ప్రత్యేక ఆహ్వానితులు హాజరౌతారని నిర్వాహకులు వెల్లడించారు.