బాహుబలి రికార్డులు బద్దలవ్వాలి..!

201
Ameer khan targets Baahubali collections
Ameer khan targets Baahubali collections
- Advertisement -

అమీర్ ఖాన్ సినిమాకు బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్దలవ్వాల్సిందే. త్రీ ఇడియట్స్.. పీకే.. దంగల్.. ఇలా ఎప్పటికప్పుడు తన కొత్త సినిమాలతో రికార్డుల వేట కొనసాగిస్తున్న అమీర్ ఖాన్‌కు బాహుబలి రూపంలో బాక్సాఫీసు దెబ్బ తగిలింది. ‘పీకే’ సినిమాతో దాదాపు రూ.800 కోట్ల వసూళ్లు రాబట్టిన అమీర్.. రూ.1000 కోట్ల వసూళ్లు మైలురాయిని కూడా అందుకుంటాడని.. అతడికే ఆ రికార్డు సాధ్యమనుకున్నారు. కానీ రాజమౌళి తీసిన బాహుబలి 2 అమీర్‌కు ఆ అవకాశం లేకుండా చేసింది.. తనకు పోటీనే లేదనుకున్న అమీర్‌కు.. బాహుబలి రూపంలో కొత్త బెంచ్ మార్క్ ఏర్పడింది.

ఈ క్రమంలో అమీర్ తన తరువాతి సినిమాపై ఫోకస్ పెంచాడట. ప్ర‌స్తుతం అత‌డు ధూమ్-3 డైరెక్ట‌ర్ విజ‌య్ కృష్ణ డైరెక్ష‌న్‌లో థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమా తీస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో అమీర్ కు అమితాబ్ కూడా తోడవుతుండటం.. ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు కూడా నటిస్తుండటంతో ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ అంచనాలకు తగ్గట్లుగా ఉంటే వసూళ్లు అసాధారణంగానే ఉంటాయని భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే స్క్రిప్టులో కొన్ని మార్పులు జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అంద‌రూ బాహుబ‌లి సినిమా గురించే మాట్లాడుకుంటున్న నేప‌థ్యంలో.. దాన్ని మించేట‌ట్టుగా థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్‌ను తీయాల‌నుకుంటున్నాడ‌ట విజ‌య్ కృష్ణ‌. అందుకే రూ.500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో మూవీని తెర‌కెక్కించాల‌ని, పైరేట్స్ ఆఫ్ ది క‌రీబియ‌న్ రీతిలో ఎక్కువ సీక్వెల్స్‌ను తీయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌. దాని కోసం స్క్రిప్ట్‌ను చాలా జాగ్రత్త‌గా సిద్ధం చేస్తున్న‌ట్టు బాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బాహుబ‌లిని థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ మించిపోవాల‌న్న కృత నిశ్చ‌యంతో విజ‌య్ కృష్ణ ప‌నులు ప్రారంభించిన‌ట్టు చెబుతున్నారు.

అంతేకాదు.. బాహుబలి-2 కంటే భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేయాలన్న ఆలోచనతో ఉంది యశ్ రాజ్ ఫిలిమ్స్. కేవలం ఇండియన్ మార్కెట్ మీదే దృష్టిపెడితే.. ‘బాహుబలి-2’ను దాటడం కష్టమని.. అందుకే హాలీవుడ్ సినిమాల స్థాయిలో అంతర్జాతీయంగా భారీ స్థాయిలో వసూలు చేస్తే తప్ప వసూళ్లలో కొత్త శిఖరాల్ని అందుకోవడం సాధ్యం కాదని భావిస్తోంది యశ్ రాజ్ ఫిలిమ్స్. మరి ఈ మార్పులు సినిమాకు ఎంత మేర కలిసొస్తాయో.. ఈ సినిమా ఎంత వసూళ్లు రాబడుతుందో చూడాలి.

- Advertisement -