హరితోత్సవానికి అంతా సిద్ధం ..

338
minister ktr
- Advertisement -

తెలంగాణ ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ఏడ‌వ విడ‌త హరిత‌హార కార్య‌క్ర‌మానికి అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. జూలై 1 నుంచి జూలై 10 వ‌ర‌కు ఏడ‌వ విడ‌త హరిత‌హార కార్య‌క్ర‌మం కొనసాగనుంద‌న్నారు. అంబ‌ర్ పేట్ క‌లాన్ లోని ఔట‌ర్ రింగ్ రోడ్డుకు అనుకుని ఉన్న రిజ‌ర్వ్ ఫారెస్ట్ ఏరియా ఏడ‌వ విడ‌త హ‌రిత‌హార కార్య‌క్ర‌మ ప్రారంభోత్స‌వానికి వేదిక కానుంద‌ని, ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ తో క‌లిసి హ‌రిత‌హార కార్య‌క్ర‌మాన్ని లాంఛ‌నంగా ప్రారంభినున్న‌ట్లు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు.

హరితహారంలో భాగంగా హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన అంబ‌ర్ పేట్ క‌లాన్ అర్బన్ ఫారెస్ట్ పార్కును కూడా ప్రారంభించ‌నున్న‌ట్లు చెప్పారు. ఆరు విడతల హరితహారం విజయవంతమైన స్ఫూర్తితో ఏడో విడత హరితహారం కార్యక్రమంలో ప్ర‌జాప్ర‌తినిదులు, అధికారులు, ప్ర‌జ‌లంద‌రూ భాగ‌స్వాములై మొక్క‌లు నాటి, ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని మంత్రి పిలుపునిచ్చారు. ఏడో విడత హరితహారంలో భాగంగా సీయం కేసీఆర్ ఆదేశాల‌ మేర‌కు ప్రతీ ఇంటికి ఆరు మొక్కలు ఇచ్చి నాటేందుకు ప్రోత్సహించనున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఇందుకు అనుగుణంగా నర్సరీల్లో మొక్కలను సిద్ధంగా ఉంచామ‌న్నారు. ఇప్పటికే మొక్కలు నాటేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాని చెప్పారు. హ‌రితహార కార్య‌క్ర‌మంలో 230 కోట్ల మొక్క‌లు నాటాల‌న్న ల‌క్ష్యానికి చేరువలో ఉన్నామ‌ని, ఈ ఏడాది ల‌క్ష్యాన్ని అధిగ‌మించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. ఆరు విడ‌త‌ల్లో 220.70 కోట్ల మొక్క‌ల‌ను నాటామ‌ని, ఏడ‌వ విడ‌త హ‌రిత‌హారం 2021-22 సంవ‌త్స‌రంలో 19.91 కోట్ల మొక్క‌ల‌ను నాటాల‌ని ల‌క్ష్యంగా నిర్దేశించుకున్న‌ట్లు పేర్కొన్నారు. ఏడవ విడత హరితహారంలో అన్ని రహదారి వనాలకు ప్రాధాన్యతను ఇవ్వాలన్న‌ సీయం కేసీఆర్ ఆదేశాల మేర‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నార‌న్నారు.

- Advertisement -