ఏపీలో ప్రతీ ఇంటికీ కరోనా పరీక్షలు..

205
corona in AP
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా వైరస్ కేసులు మరింత పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కేసుల ఉధృతి మాత్రం తగ్గటం లేదు. ఏపిలో కరోనా కేసులు 10 వేలకు చేరువగా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆరోగ్య శాఖ అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. రానున్న మూడు నెలల్లో ప్రతీ ఇంటికీ సమగ్ర స్క్రీనింగ్‌తో పాటు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు.

గత 24 గంట‌ల్లో 20639 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించగా, వాటిల్లో 462 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కోవిడ్ కారణంగా 8 మంది మ‌ృతి చెందినట్లు ప్రకటించారు. ఏపీలో నమోదైన తాజా కేసుల్లో స్థానికంగా 407 కరోనా కేసులు నమోదు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 40 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 15 మందికి పాజిటివ్‌‌గా తేలిందని అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 9,834 కి చేరినట్లుగా హెల్త్ బులిటెన్‌లో ప్రకటించారు. ఇక మొత్తం మరణాల సంఖ్య 119కి చేరింది. 4,592 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఏపీలో 5,123 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

దేశవ్యాప్తంగా కరోనా టెస్టులు పెరుగుతున్న వేళ మిగతా అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా టెస్టులు జరుపుతూ ఏపీ ప్రభుత్వం ఏరోజు కారోజు కొత్తగా ఎవరికి కరోనా ఉన్నట్లు తేలినా వెంటనే వారిని ఇతరుల నుంచి వేరు చేస్తోంది. ఇలా చేయడంతో కరోనా కంట్రోల్ అవుతోందని అనుకోవచ్చు.. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఇప్పటికీ ఏపీలో కరోనా తీవ్రత పెరుగుతూనేవుంది. అయితే ఈ మాత్రం టెస్టులు చెయ్యకపోతే కరోనా ఇంకా ఎక్కువగా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రతీ ఇంటికీ కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించింది.

- Advertisement -