తెలంగాణలో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక కీలక ఘట్టానికి చేరుకున్నది. శనివారం పోలింగ్ నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకొని సర్వసన్నద్ధమయ్యారు. నియోజకవర్గంలో 1,17,922 మంది పురుషులు, 1,19,099 మంది స్త్రీలు, ఒక థర్డ్ జెండర్, మొత్తం 2,37,022 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నియోజకవర్గంలో 306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగేందుకు మరోవైపు పోలీసు యంత్రాంగం పూర్తి భద్రత ఏర్పాట్లు చేసింది.
అధికార టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ నర్సింగారావు, మరో 27 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఓటింగ్ పూర్తికాగానే ఈవీఎంలను, వీవీ ప్యాట్లను కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలకు తరలిస్తారు. వీటిని భద్రపరిచేందుకు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. నవంబరు 2న ఇక్కడే ఓట్ల లెక్కింపు జరగనున్నది. ఇక మొత్తంగా శనివారం జరిగే ఎన్నికల కోసం జిల్లా యంత్రంగా అన్ని ఏర్పాటు చేయడం తో పాటు ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు..