తమిళనాట మరో కొత్త పార్టీ!

2
- Advertisement -

తమిళనాడు రాజకీయ రంగంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే తమిళ చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు రాజకీయాల్లోకి రాగా  తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో, అభిమానులు ‘తల’ అని ఆప్యాయంగా పిలుచుకునే అజిత్ కుమార్ అభిమానులు ఊహించని రీతిలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు.

కాంచీపురం జిల్లా కుంద్రత్తూరు వేదికగా అజిత్ అభిమాన సంఘాల ప్రతినిధులంతా కలిసి ‘అనైతు నన్బర్గళ్ మున్నేట్ర కళగం’ (Anaithu Nanbargal Munnetra Kazhagam) పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రాబోయే 2031 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ కుమార్‌ను ముఖ్యమంత్రిగా పీఠంపై కూర్చోబెట్టడమే తమ ప్రధాన లక్ష్యమని సంచలన ప్రకటన చేశారు.

రాబోయే రోజుల్లో తమిళనాడులోని అన్ని జిల్లాల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేయడంతో పాటు విస్తృత స్థాయిలో సామాజిక, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి, నియోజకవర్గానికి పార్టీ కమిటీలను విస్తరించి, ప్రజల్లో బలమైన పునాది నిర్మించాలని భావిస్తున్నారు. ఒకవేళ అజిత్ కుమార్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భావిస్తే, పార్టీకి సంబంధించిన పూర్తి నాయకత్వ బాధ్యతలను ఆయనకే అప్పగిస్తామని స్పష్టం చేశారు.

అయితే, ఈ కొత్త పార్టీ ఏర్పాటుపై నటుడు అజిత్ కుమార్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదా ఆమోదం రాలేదు. సాధారణంగా అజిత్ తన అభిమాన సంఘాలను కూడా రద్దు చేసుకుని, రాజకీయాలకు దూరంగా ఉంటానని గతంలోనే పలుమార్లు స్పష్టం చేశారు. అయినప్పటికీ, విజయ్ వంటి ఇతర స్టార్ హీరోల రాజకీయ ఎంట్రీ తర్వాత, అజిత్ అభిమానులు కూడా ఆయన్ను రాజకీయ వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ దిశగా అడుగులు వేశారు.

Also Read:ఆసియా గేమ్స్..భారత్‌కు మరో పతకం

తమిళనాడు రాజకీయ చరిత్రలో సినిమా రంగానికి, రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంది. ఎంజీఆర్, జయలలిత, విజయకాంత్ నుండి ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ (TVK) వరకు ఎందరో నటులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడు అజిత్ అభిమానులు ఏకంగా 2031 ఎన్నికల టార్గెట్‌తో పార్టీ స్థాపించడం తమిళ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -