రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ వ్యవస్థ పూర్తిగా చిన్నభిన్నమైందని, ‘కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు’ అని తాము ఎన్నికల ముందే హెచ్చరించామని బిఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు (కేటీఆర్) వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న కరెంట్ కోతలపై మరియు కాంగ్రెస్ పాలనా వైఫల్యాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు మళ్లీ 1980 నాటి కరెంట్ కోతల రోజులను గుర్తుచేస్తున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.విద్యుత్ కోతలను తట్టుకోలేక రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలంలోనూ రైతులు, ప్రజలు రాస్తారోకోలు, ధర్నాలు చేస్తున్నారని తెలిపారు.ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఈ కరెంట్ కోతలకు ‘ఎల్ నినో’ ప్రభావం ఎంతమాత్రమూ కారణం కాదని, ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనం వల్లే వచ్చిందని మండిపడ్డారు.
పవర్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు లేకపోవడం వల్లే విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యుత్ రంగంలో జరుగుతున్న అక్రమాలపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.బొగ్గు కొనుగోళ్లలో రూ. 1600 కోట్ల స్కామ్ జరిగిందని మేం బహిరంగంగా చెబితే, మమ్మల్ని తనిఖీలకు గనుల్లోకి కూడా రానివ్వలేదు అని కేటీఆర్ విమర్శించారు.
విద్యుత్ ప్లాంట్ల నిజస్థితిని తేల్చేందుకు రేపు (గురువారం) బీఆర్ఎస్ తరఫున ఆరు ప్రత్యేక బృందాలు రాష్ట్రంలోని పవర్ ప్లాంట్లను సందర్శిస్తాయని కేటీఆర్ వెల్లడించారు. 4 వేల మెగావాట్ల కెపాసిటీ ఉన్న ప్రతిష్టాత్మక యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో కూడా ప్రస్తుతం బొగ్గు నిల్వలు లేక ఉత్పత్తిపై ప్రభావం పడిందని ఆయన ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు.స్వరాష్ట్రం సిద్ధించే సమయానికి 7,000 మెగావాట్లుగా ఉన్న విద్యుత్ సామర్థ్యాన్ని కేసీఆర్ హయాంలో ఏకంగా 20,000 మెగావాట్లకు పెంచామని స్పష్టం చేశారు.దేశంలోనే అన్ని రంగాలకు, ముఖ్యంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు.
ప్రస్తుతం సింగరేణి సంస్థకు జెన్కో (GENCO) దాదాపు రూ. 50,000 కోట్ల బకాయిలు పడిందని, నిర్వహణ లోపాల వల్ల మణుగూరు, పాల్వంచ వంటి ప్రధాన ప్లాంట్లలో కరెంట్ ఉత్పత్తి నిలిచిపోయిందని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న ఈ తీవ్ర విద్యుత్ సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరినప్పటికీ, కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం విచారకరమని ఆయన ముగించారు.
Also Read:ఇది దేశద్రోహం..రాహుల్ ఫైర్

