ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా జిల్లాలకు తీవ్ర వర్ష ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో తీవ్రరూపం దాల్చిన వాయుగుండం ప్రస్తుతం కళింగపట్నం సమీపంలో కేంద్రీకృతమై ఉందని, దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
వాయుగుండం విశాఖపట్నం – ఒడిశాలోని గోపాల్‌పూర్ మధ్య ఈ అర్ధరాత్రికి లేదా రేపు (సెప్టెంబర్ 24) ఉదయానికి తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు.తీరం దాటే సమయంలో గంటకు 45 నుండి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
వాయుగుండం తీవ్రత కారణంగా ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పలుచోట్ల అత్యంత భారీ వర్షాలు నమోదవుతున్నాయి.లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
సముద్రం అలజడిగా ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని తీరప్రాంత హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే వేటలో ఉన్నవారు వెంటనే ఒడ్డుకు తిరిగి రావాలని కోరారు.వాతావరణ శాఖ హెచ్చరికలతో తీరప్రాంత అధికార యంత్రాంగం హైఅలర్ట్ ప్రకటించింది.
ముంపు ప్రమాదం ఉన్న గ్రామాలు, లోతట్టు ప్రాంతాలను గుర్తించి, అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస కేంద్రాలకు తరలించడానికి విపత్తు నిర్వహణ బృందాలను (SDRF/NDRF) సిద్ధంగా ఉంచినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
Also Read:Kaaka:సెట్‌లో మెగా వేడుకలు..

