కరోనా వైరస్ నివారణకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా నివారణకు పలువురు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు విరాళాలు ఇస్తున్నారు. తాజాగా భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే మహారాష్ట్ర ప్రభుత్వ సీఎం సహాయ నిధికి రూ.10లక్షలు విరాళం ఇచ్చారు. కరోనాపై చేస్తున్న పోరాటంలో తాను ఈ చిన్న సాయం చేస్తున్నట్లు తెలిపాడు. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలుస్తానని తెలిపాడు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలంతా సహకరించి ఇంట్లోనే ఉండాలని సూచించారు. కాగా మాజీ క్రికెటర్ , ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ.కోటి విరాళం ఇచ్చారు.కాగా భారత జట్టు క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి దంపతులు కూడా మహారాష్ట్ర ప్రభుత్వానికి తమ వంతు సహాయం చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రూ.50 లక్షలు, క్రికెటర్ సురేశ్ రైనా రూ.52 లక్షలు విరాళం అందించిన సంగతి తెలిసిందే. దేశంలో కరోనా వైరస్ బాధితులు రోజు రోజుకి పెరుగుతున్న సంగతి తెలిసింందే. ఇప్పటికే 1000మందికి పైగా కరోనా పాజిటివ్ వచ్చింది.