దేశంలో కరోనా మూడో దశ ప్రభావం చిన్నారులపై అధికంగా ఉంటుందన్న అంచనాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పిల్లలపై కరోనా టీకా కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని ఎయిమ్స్ సహా దేశంలోని నాలుగు ప్రాంతాల్లో ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పాట్నా ఎయిమ్స్‌లో పిల్లలపై ట్రయల్స్ ప్రారంభం అయ్యాయి. 2 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలపై ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నామని, ఇందు కోసం తాము 18 మంది చిన్నారులను ఎంపిక చేశామని ఢిల్లీ ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే ఈ పరీక్షలకు డీజీసీఐ అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ వాటిని చిన్న పిల్లలకు వేసేందుకు ఇంకా ఎలాంటి అనుమతులు రాలేదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ క్లినికల్ ట్రయల్స్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ టీకా పిల్లలపై పనిచేస్తుందా లేదా అని స్టడీ చేయనున్నారు. స్క్రీనింగ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత పిల్లలకు టీకాలు ఇవ్వనున్నారు.
రెండు డోసుల రూపంలో టీకా ఇవ్వనున్నారు. 28వ రోజు తర్వాత రెండో డోసు ఇస్తారు. కోవాగ్జిన్ స్క్రీనింగ్ ట్రయల్స్ స్టార్ట్ అయ్యాయని, రిపోర్ట్స్ వచ్చాక వారికి టీకా ఇస్తామని ఢిల్లీ ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ రాయ్ తెలిపారు. రెండేళ్ల నుంచి 18 ఏళ్ల వయసున్న వారికి రెండవ, మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు డీజీసీఐ అనుమతి ఇచ్చింది.