నిజామాబాద్ పార్లమెంట్ స్ధానం పోలింగ్ పై ఉత్కంఠ వీడింది. అభ్యర్దులు ఎక్కువమంది ఉండటంతో బ్యాలెట్ లేదా ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరుపుతారనే సందేహం నెలకొంది. నిజామాబాద్ లోక్ సభ స్థానానికి జరిగే ఎన్నికలను ఈవీఎంల ద్వారానే పోలింగ్ జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందుకు తగిన ఏర్పాట్లు చేపట్టాలని తెలంగాణ రాష్ర్ట ఎన్నికల కమిషన్ కు సూచించింది.
ఈవీఎంలు, వీవీప్యాట్లను సరఫరా చేయాలని ఈసీఐఎల్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. నిజామాబాద్ పార్లమెంట్ నుంచి అత్యధికంగా 185 నామినేషన్లు దాఖలు కావడంతో ఎన్నికలు ఎలా నిర్వహించాలన్న సందిగ్దంపై ఎన్నికల సంఘం కసరత్తు చేపట్టింది. అంత మంది అభ్యర్థులకు ఈవీఎంలలో చోటు దక్కదనే వాదనకు ఫుల్‌స్టాప్ చెబుతూ నిర్ణయం తీసుకుంది.
ఈవీఎంలతోనే పోలింగ్ నిర్వాహణకు ఏర్పాట్లు చేపట్టాలని తెలంగాణ రాష్ర్ట ఎన్నికల ప్రధానాధికారికి ఆదేశాలు జారీ చేసింది. ఎం3 యంత్రాలు, 26,820 బ్యాలెట్ యూనిట్లు, 2,240 కంట్రోల్ యూనిట్లు 2,600 వీవీ ప్యాట్లు సరఫరా చేయాలని ఈసీఐఎల్ సంస్థకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.