2019 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను నిన్న సాయంత్రం విడుదల చేసింది ఎన్నికల కమిషన్. దేశ వ్యాప్తంగా 7విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్దం చేశారు అధికారులు. రాజకీయ నాయకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ప్రచారంలో బిజీ అయ్యారు నేతలు. ఇదంతా బానే ఉంది కానీ ఇప్పుడు మరో విషయంపై రాజకీయ నేతల్లో టెన్షన్ మొదలైంది. నిన్న సాయంత్రం ఆదివారం రాహు కాలంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో ఇప్పుడు తలలు పట్టుకున్నారు నేతలు. నిన్న సాయంత్రం 4.30 గంటల నుంచి 6గంటల వరకూ రాహు కాలంలో కావడంతో అదే సమయంలో కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ అరోరా 5గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు.
ప్రధానంగా తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతల్లో ఈ సెంటిమెంట్ దడ పుట్టిస్తుందట. మరోవైపు పోలింగ్ రోజు కూడా ప్రతీకూల గడియాలు ఉన్నాయంటున్నారు జ్యోతిష్యులు. తెలుగు రాష్ట్రాల్లో ఎప్రిల్ 11న జరిగే తొలి దశ ఎన్నికలు కూడా యమగండంలోనే ప్రారంభంకానుంది. ఎప్రిల్ 11న ఉదయం 6.07 గంటల నుంచి 7.39గంటల వరకూ యమగండం ఉందట. అయితే పోలింగ్ ఉదయం 7 గంటలకు.. అంటే యమగండం సమయంలోనే ప్రారంభం కానుంది. ఇక ఆ తర్వాత ఉదయం 9.12 నుంచి 10.44 వరకు గుళికకాలం ఉంది. మరోవైపు మధ్యాహ్నం 1.49 నుంచి సాయంత్రం 3.22 గంటల వరకు రాహుకాలం. సాయంత్రం సుమారు రెండు గంటలపాటు వర్జ్యం ఉందట. వీటిని చూస్తుంటే మన నేతలకు వణుకు పుడుతుందట. అసలే జ్యోతిష్యాన్ని అతిగా నమ్మె మన తెలుగు రాష్ట్రాల నాయకులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి.