మహాకూటమికి ఓటు వేస్తే మరణశాసనం రాసుకున్నట్లేనన్నారు మంత్రి కేటీఆర్.కామారెడ్డి జిల్లా లింగంపేటలో టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్ధాయి సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ ఎల్లారెడ్డిలో గులాబీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిలో ఏనుగు రవీందర్ రెడ్డి గెలుపును సీఎం కేసీఆర్‌కు బహుమతిగా ఇద్దామని తెలిపారు. కాంగ్రెస్,టీడీపీది అనైతిక పొత్తు అని ఆరోపించారు కేటీఆర్. వందల మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన కాంగ్రెస్,టీడీపీలతో కోదండరాం సార్ ఏ విధంగా పొత్తుపెట్టుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చంద్రబాబు కేంద్రానికి 32 లేఖలు రాశారని…అలాంటి పార్టీతో తెలంగాణ ప్రజలకు ముప్పు పొంచి ఉందని తెలిపారు.
నీటి వనరుల కోసమే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని కాళేశ్వరంతో 35 లక్షల ఎకరాలకు నీరు రాబోతుందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు.ఎల్లారెడ్డిలో 5 రిజర్వాయర్లను నిర్మిస్తున్నామని..కాళేశ్వరంతో లక్షా ఇరవై వేల ఎకరాలకు సాగునీరు రాబోతుందన్నారు. ఎల్లారెడ్డి,కామారెడ్డి సుభీక్ష ప్రాంతాలుగా మారబోతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేస్తు రైతులకు అన్యాయం చేస్తున్నాయని తెలిపారు. చచ్చిపోయిన వారి పేరు మీద కోర్టుల్లో కేసులు వేస్తూ దివాళ కోరు రాజకీయాలకు తెరలేపాయని మండిపడ్డారు. కాంగ్రెస్ నీతిమాలిన పార్టీ…భారతదేశంలో ఇలాంటి పార్టీ లేదన్నారు.
కావేరి నది నీటిపంపకాల విషయంలో కర్ణాటక,తమిళనాడు పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ప్రజల కోసం పనిచేస్తాయని చెప్పారు. కానీ ఇక్కడే పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందన్నారు. కాంగ్రెస్ లాంటి ప్రతిపక్షం తెలంగాణలో ఉండటం మనం చేసుకున్న దురదృష్టం అన్నారు. రైతే రాజు కావాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని అందుకే లక్ష రూపాయల రుణమాఫీ చేస్తున్నారని
తెలిపారు. రైతు బంధు,రైతు భీమా ద్వారా వారికి భరోసా కల్పిస్తున్నామని చెప్పారు.
నాటి కాంగ్రెస్ పాలనకు నేటి టీఆర్ఎస్ పాలనకు తేడాను రైతులు గమనిస్తున్నారని చెప్పారు కేటీఆర్.కరెంట్ కోసం ఆనాడు సబ్ స్టేషన్ల ముందు ధర్నా జరగని రోజు లేదని కానీ నేడు ఆ పరిస్థితి మారిందన్నారు. రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. నాడు ఎరువుల కోసం రైతులు క్యూ లైన్లలో నిలబడే పరిస్థితి ఉండేదని,పోలీస్ స్టేషన్లో ఎరువులు పంచిన పరిస్థితి చూశామని కానీ నేడు రైతులకు సకాలంలో ఎరువులు,విత్తనాలను అందిస్తున్నామని చెప్పారు.
సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రపంచ చరిత్రలో ఏ నాయకుడు,ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతులకు పెట్టుబడిగా రూ. 8వేలు అందిస్తున్నారని గుర్తుచేశారు. వచ్చే ఏడాది నుంచి రైతు పెట్టుబడిని రూ. 10 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. కేసీఆర్ అంటే కాలువలు,చెరువులు,రిజర్వాయర్లు అని తెలిపారు.