తెలంగాణ ప్రభుత్వ తలపెట్టిన కంటివెలుగు కార్యక్రమం సక్సెస్ బాటలో నడుస్తోంది. గ్రామీణ, పట్టణప్రాంతాల ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల కంటి సమస్యలను పరిష్కరించాలన్నదే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
అయితే మూడో రోజు శుక్రవారం 803 వైద్యబృందాలు 1,07,361 మందికి కంటి పరీక్షలు చేయగా, అందులో 46,365 మంది మహిళలు, 60,982 మంది పురుషులు, 14 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. మొత్తం పరీక్షలు నిర్వహించిన వారిలో 9,984 మందికి కండ్లద్దాలను పంపిణీ చేశారు.
ఇదిలా ఉండగా.. ఉచితంగా కంటిపరీక్షలు చేయించడమే కాకుండా కళ్ళద్దాలను కూడా ప్రభుత్వం పంపిణీ చేయటం పట్ల ప్రజలు వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా…అవసరమైనవారికి మందులు అందజేస్తూ పోషకాహారం, కంటి జాగ్రత్తలపై వైద్యులు సూచనలు చేస్తున్నారు. కంటి వైద్యశిబిరాల నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా వైద్య, ఆరోగ్య, కుటుంబసంక్షేమశాఖ, ఇతర ప్రభుత్వశాఖల అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.‘కంటి వెలుగు’కార్యక్రమాన్ని ఈ నెల 15న ప్రారంభించిన సంగతి తెలిసిందే.