నగరంలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎండలు మండిపోతుండటంతో నగరవాసులు ఉక్కిరిబిక్కరవుతున్నారు. సోమవారం నగరంలో రికార్డు స్థాయిలో 43 డిగ్రీల గరిష్టఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో నమోదయిన ఉష్ణోగ్రలు ఇదే రికార్డని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సాధారం కంటే నగరంలో 4.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి.
రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో తెలంగాణ వ్యాప్తంగా వాతావరణశాఖ వడగాల్పుల హెచ్చరికలు జారీచేసింది. మధ్యాహ్నం వేళల్లో 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకుంటుండంతో ప్రధాన రహదారులు బోసిపోతున్నాయి. రోడ్లపైకి వచ్చేందుకు సాధారణ ప్రజలు భయపడుతున్నారు.ఎండలకు పిల్లలు, వృద్దులు బయటకురావద్దంటూ వైద్యులు సూచిస్తున్నారు.
ఈ మే నెల రాకముందే సగటు ఉష్ణోగ్రతలతో పోలిస్తే 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీ, తెలంగాణల్లో ఎండల తీవ్రత మరింతగా పెరిగింది. ఆదిలాబాద్, నిజామాబాద్, గుంటూరు, చిత్తూరు, విశాఖపట్నం తదితర జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ముఖ్యంగా బొగ్గు గనులున్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రత అధికంగా ఉంది. ఇదిలావుండగా, ఎల్ నినో, క్యుములో నింబస్ మేఘాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి.