కోహ్లీ మరో రికార్డు..

250
- Advertisement -

భారత పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీని ముద్దుగా ఛేజ్‌ మాస్టర్‌ అని పిలుస్తుంటారన్న విషయం తెలిసిందే. ఎందుకంటే లక్ష్య ఛేదనలో కోహ్లీ ఆట తీరు అభిమానులకు కనువిందుగా ఉంటుంది. ముచ్చటైన డ్రైవ్‌లు, ఫ్లిక్స్‌, కట్‌ షాట్లతో మైదానం అన్నివైపులా కళ్లు చెదిరే షాట్లతో అలరిస్తాడు. తాజాగా డర్బన్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ మరో సారి తనదైన షాట్లతో అభిమానులను మంత్ర ముగ్ధుల్ని చేశాడు. ఈ వన్డేలో 112 పరుగుల కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో కోహ్లీ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరోసారి లక్ష్య ఛేదనలో తన సత్తా ఏమిటో చాటి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డును అందుకున్నాడు. ఈ వన్డేలో కోహ్లీ మరో అరుదైన ఘనత అందుకున్నాడు. తాజాగా ఈ సిరీస్‌లో కోహ్లీ భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి సౌరభ్‌ గంగూలీ రికార్డును సమం చేశాడు.

 Virat Kohli Scores 33rd ODI Century

గతంలో భారత వన్డే క్రికెట్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన గంగూలీ సారథిగా 11 శతకాలు సాధించాడు. ఇప్పటి వరకూ భారత సారథి బాధ్యతలు అందుకున్న ఏ ఆటగాడు ఇన్ని శతకాలు నమోదు చేయలేదు. తాజాగా కోహ్లీ ఆ రికార్డును సమం చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ 112 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. కోహ్లీ వన్డే కెరీర్‌లో ఇది 33వ శతకం కాగా కెప్టెన్‌గా 11వది కావడం విశేషం. గంగూలీ 142 ఇన్నింగ్స్‌ల్లో 11 శతకాలు సాధించగా.. కోహ్లీ కేవలం 41 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ ఘనతను అందుకున్నాడు. డర్బన్‌లో నిన్న జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య దక్షిణాఫ్రికాపై భారత్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో వన్డే ఆదివారం సెంచూరియన్‌లో జరగనుంది.

ఇప్పటి వరకు కోహ్లీ తన వన్డే కెరీర్‌లో 33 శతకాలు నమోదు చేయగా ఇందులో 20 శతకాలు ఛేదనలో సాధించనవే కావడం విశేషం. కోహ్లీ తాజా ఇన్నింగ్స్‌కు అభిమానులే కాదు మాజీ క్రికెటర్లు సైతం ఫిదా అయి సలాం కొట్టారు. ట్విటర్‌ ద్వారా కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఛేజ్‌ మాస్టర్‌ మరోసారి తన సత్తా చాటాడు. కోహ్లీ గ్రేటెస్ట్‌ ఛేజర్‌’ అంటూ పలువురు ట్వీట్‌ చేశారు.

- Advertisement -