రూ.1000,రూ.5000, మహా అయితే..రూ.10,000…ఇక ఇంతకంటే చిల్లరను లెక్కపెట్టాలంటే తల ప్రాణం తోకకొస్తుంది. కానీ చైనాకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా రూ.40 లక్షల చిల్లరను గుమ్మరించి ఓ కారు షోరూమ్ సిబ్బందికి చుక్కలు చూపించాడు. అసలు విషయానికొస్తే..చిల్లర డబ్బులతో చైనాకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా బీఎండబ్ల్యూ కారుని కొనుగోలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
చిన్నా చితక పనులు చేస్తూ నాణెల రూపంలో డబ్బుని దాచుకున్న పుజియన్ ప్రావిన్స్ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇటీవల షోరూమ్‌కి వెళ్లి బీఎండబ్ల్యూ కారు గురించి ఆరా తీశాడు. చివరికి రూ.40 లక్షల విలువైన కారుని ఫిక్సైయ్యాడు.
అయితే డబ్బు చెల్లింపులో భాగంగా తొలి విడదగా రూ. 6.80 లక్షలు చిల్లర రూపంలో చెల్లిస్తానని షోరూమ్ సిబ్బందికి అతను చెప్పడంతో వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ చిల్లర చెల్లింపుపై తొలుత ససేమేరా అన్నా.. కస్టమర్‌ని పోగొట్టుకోవడం ఇష్టం లేక.. చివరికి చిల్లరకే అంగీకరించారు.
దీంతో మొత్తం 10 డబ్బాల్లో కస్టమర్ చెల్లించిన మొత్తం చిల్లరని షోరూమ్‌లోనే నేలపై పోసి.. లెక్కించేసరికి సిబ్బందికి నడుం నొప్పులు వచ్చాయట. మొత్తానికి చిల్లరతో ఆ సిబ్బందికి చెమటలు పట్టించినట్టున్నాడు ఆ చైనా వ్యక్తి.