హైదరాబాద్‌లో ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు (జీఈఎస్) ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. దేశ విదేశాల నుంచి ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు నగరానికి వస్తుండడంతో హైదరాబాద్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. నగరంలోని ముఖ్య ప్రాంతాలు సరికొత్త విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన సలహాదారు ఇవాంక ట్రంప్,ప్రధానమంత్రి నరేంద్రమోడీ సదస్సులో పాల్గొంటున్నారు. దీంతో కనీవినీ ఎరుగని రీతిలో భద్రత కల్పిస్తున్నారు.
ఈ నెల 27న ఇవాంకా ట్రంప్.. నగరంలోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. 180 మంది పారిశ్రామికవేత్తలు, డెలిగేట్లతో కలిసి ప్రత్యేక విమానంలో రానున్న ఆమె.. శంషాబాద్ నుంచి రోడ్డు మార్గంలో మాదాపూర్‌లోని వెస్టిన్ హోటల్‌కు చేరుకుని బస చేస్తారు.
కోట్లు ఖర్చు పెట్టి నిర్వహిస్తున్న ఈ సదస్సులో 100కు పైగా దేశాలు.. 1500 పారిశ్రామికవేత్తలు పాల్గొననున్నారు. అమెరికా, భారత ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో ఈ సదస్సు జరగనుంది.
మహిళకు తొలి ప్రాధాన్యం.. అందరికీ సౌభాగ్యం (ఉమెన్ ఫస్ట్.. ప్రాస్పరిటీ ఫర్ ఆల్) ప్రధానాంశంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.ఇందులో పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చిస్తారు. దీంతో ఇక్కడ లోకల్ గా ఉన్న పారిశ్రామిక వేత్తలకు, స్టార్టప్స్ కి అవగాహన వచ్చే అవకాశాలుంటాయి.
ఇప్పటికే దేశం వ్యాప్తంగా స్టార్టప్ కల్చర్ పెరిగింది. ఈ టైంలో జరుగుతున్న సదస్సుతో మరింత మంది విద్యార్థులు, యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఉపయోగపడుతుంది. అమెరికాతో పాటు వివిధ దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నందున వారి నుంచి స్ఫూర్తి పొందే అవకాశం ఉంది.స్థానిక స్టార్టప్స్, ప్రాజెక్టులు ఇక్కడికి వచ్చే పారిశ్రామికవేత్తలకు నచ్చితే వాటిల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలున్యని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.