మొత్తం టెలికాం ఇండస్ట్రీనే ఓ ఆట ఆడుకున్న రిలయన్స్ జియో..టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ముందడుగు వేస్తోంది. ఇదే క్రమంలో రిలయన్స్ జియో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఫీచర్ ఫోన్ ఉత్పత్తులను నిలిపివేయనుందని ఇటీవలే సోషల్ మీడియాలో వార్తలు రావడం తెలిసిందే.
ప్రస్తుతం `కై` ఆపరేటింగ్ సిస్టం ద్వారా పనిచేస్తున్న జియో ఫీచర్ ఫోన్లలో చాలా వరకు యాప్స్ పనిచేయడం లేదని, అలాగే ఎయిర్‌టెల్ కూడా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేసే ఫీచర్ ఫోన్లను విడుదల చేయనుండటంతో పోటీని తట్టుకోలేననే భయంతో జియో ఫీచర్ ఫోన్ల ఉత్పత్తిని నిలిపివేసిందని `ఫ్యాక్టర్ డెయిలీ` ప్రచురించింది.
అయితే `ఫ్యాక్టర్ డెయిలీ` అనే మీడియా సంస్థ ప్రకటించిన నివేదిక ఆధారంగా వచ్చిన ఈ వార్తలన్నీ అవాస్తవమని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ప్రస్తుతం జియో ఫీచర్ ఫోన్ల మొదటి దశ డెలివరీలు తుది స్థాయికి వచ్చాయని, త్వరలో రెండో విడత ప్రీ బుకింగ్‌కి సంబంధించిన తేదీలను విడుదల చేస్తామని పేర్కొన్నారు.