యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన తొలి రోజు నుంచే కలెక్షన్ల దూకుడు ప్రదర్శిస్తున్న ఈ చిత్రం వారాంతానికి ఎన్టీఆర్ కెరీర్లోనే రికార్డు వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సిస్‌లోనూ జై లవకుశ బాక్సాఫీసు వద్ద వసూళ్లను రాబుతునే ఉంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే 62 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు ట్రేడ్ అనలిస్టులు పేర్కొంటున్నారు. ఇక షేర్ విషయానికి వస్తే సుమారు రూ.40 కోట్లు వసూలు చేసింది.
ఈ నేపథ్యంలో జై లవకుశ సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భావోద్వేగంతో మాట్లాడిన ఎన్టీఆర్..సినిమా క్రిటిక్స్‌కు చురకలంటించాడు. ‘జై లవ కుశ’ చిత్రం ద్వారా తన అభిమానులందరిని తల ఎత్తుకునేలా చేశానని తాను భావిస్తున్నానని జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు. ఈ చిత్రం విజయానికి తోడ్పడ్డ యావత్తు తెలుగు ప్రేక్షక దేవుళ్లందరికీ కృతఙ్ఞతలు తెలిపారు.
ఈ మధ్య మన తెలుగు ఇండస్ట్రీలో మొదలైంది. ఒక చిత్రం విడుదలైతే, అది ఎమర్జెన్సీ వార్డులో ఉన్నటువంటి ఓ పేషెంట్ లాంటిది. వాడు బతుకుతాడా? చస్తాడా? అనుకునే చుట్టాలం మేము. డాక్టర్లు ప్రేక్షకులు. దారిన పోయే దానయ్యలు కొంతమంది విశ్లేషకులు. ప్రేక్షకులు తీర్పు ఇచ్చేలోపే వారే తీర్పు ఇచ్చేస్తారు… అసలు సినిమా చచ్చిపోయిందో లేదో ప్రేక్షకులు చెబుతారు. అప్పుడు రెడీ. ఆశలు వదులుకుంటాం.. ఒప్పేసుకుంటాం’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగం చెందారు.
దీనికి సంబంధించి ఓ కథను సైతం ఆయన చెప్పి వినిపించారు. మనం హాస్పిటల్ కు వెళతాం. మనకు సంబంధించిన వ్యక్తి చాలా క్రిటికల్ కండీషన్ లో ఉంటారు. క్రిటికల్ కండీషన్ లో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ వార్డులో పెట్టి ఎంతో నేర్పు, నైపుణ్యం ఉన్నటువంటి డాక్టర్లు పేషెంట్ కు చికిత్స చేస్తుంటారు. పేషెంట్ కుటుంబసభ్యులు మాత్రం డాక్టర్లు ఏం చెప్పబోతారోనని ఆత్రంగా ఎదురు చూస్తుంటారు. అంత నైపుణ్యం ఉన్న డాక్టర్లు ‘ఆగండమ్మా, ఒకసారి కరెక్టుగా చెక్ చేయనివ్వండి. పరీక్షలన్నీ చేయనివ్వండి. ఈ పరీక్షల తర్వాత పేషెంట్ పై ఆశలు పెట్టుకోవచ్చా? లేదా? అనే మాటను చెబుతాం’ అని చెబుతారు.
ఆ పేషెంట్ పక్కనే మనం ఒక కుర్చీ వేసుకుని కూర్చుంటాం. ఈలోపు.. అటుగా వెళ్లి వచ్చే వ్యక్తులు ‘బతకడు.. పోతాడు’, ‘మొన్న మా వాడికి కూడా ఇలానే అయింది. ఛాన్స్ లేదు..పోతాడు’, ఇంపాజిబుల్..అవుట్’ అని అంతా వాళ్లకు తెలిసినట్టే అంటూ ఉంటారు. ఎంతో నేర్పు కలిగినటువంటి వైద్యులు చెప్పనటువంటి మాట వీళ్లు మనకు చెబుతుంటారు!.. వాళ్లు ధైర్యం ఇవ్వకపోగా, చావుబతుకుల్లో ఉన్న వాడిని చంపేయడం, వాడిపై ఆశలు పెట్టుకున్న వాళ్లను ఇంకా చంపేయడం చేస్తుంటారు. అలాంటి వారే సినిమా క్రిటిక్స్ అంటూ ఎన్టీఆర్ చురకలంటించారు.