సింగరేణికి దసరా పండుగ ముందే వచ్చింది. గత సంవత్సరం సింగరేణి లాభాల్లో 23శాతం వాటా, దీపావళి బోనస్ ప్రకటించి కార్మికులపై వరాల జల్లు కురిపించిన కేసీఆర్ …. ఈ సంవత్సరం అదే ప్రేమను చాటుకున్నారు. పీఎల్ఆర్ (దీపావళి) బోనస్ ను రూ. 54 వేల నుంచి రూ. 57 వేలకు, దసరా పండుగ అడ్వాన్స్ ను రూ.18 వేల నుంచి 25 వేలకు పెంచాలని యాజమాన్యం నిర్ణయించింది. దీనివల్ల ఒక్కో కార్మికుడికి రూ.82 వేలు అందనున్నాయి.
సీఎం ఆదేశాలతో పండుగకు ముందే ఈ నెల 22న దసరా అడ్వాన్స్ కార్మికుల బ్యాంక్ ఖాతాల్లో వేస్తామని సింగరేణి సీఎండీ శ్రీధర్ ప్రకటించారు. దీపావళి బోనస్ వచ్చే నెల రెండో వారంలో కార్మికుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ఈ రెండింటిని పెద్ద మొత్తంలో పెంచడంతో ఈ ఏడాది రూ.456 కోట్ల రూపాయలు సంస్థ వెచ్చిస్తోందని శ్రీధర్ వివరించారు.
దీపావళి బోనస్ చెల్లింపులకు రూ. 336 కోట్లు, దసరా అడ్వాన్స్ కోసం రూ.120 కోట్లు, మొత్తం కలిపి రూ.456 కోట్లు చెల్లించనున్నట్టు సీఎండీ శ్రీధర్ వెల్లడించారు. దీపావళి బోనస్ గా చెల్లించే పీఎల్ఆర్ బోనస్ 2014-15లో రూ.48 వేల 500 ఉండగా, 2015-16లో రూ.54 వేలకు పెంచారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరో మూడు వేల రూపాయలు పెంచి రూ.57 వేలు చెల్లించాలని నిర్ణయించారు.