కావేరీ నది జలాల పంపిణీ వివాదంలో తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటక నుంచి అదనంగా 11 వేల మిలియన్ క్యూబిక్ (టీఎంసీ) అడుగుల కావేరీ నీటిని విడుదల చేయించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అదనపు పత్రాలను రికార్డుల్లోకి తీసుకోవాలంటూ తమిళనాడు దాఖలు చేసిన మూడో దరఖాస్తును కూడా కొట్టివేయనున్నట్లు ధర్మాసనం పేర్కొంది.
తమిళనాడు డిమాండ్ మేరకు 11 టీఎంసీల కావేరీ నీటిని విడుదల చేయడం కష్టమని కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టుకు తెలిపింది. అక్టోబర్ 7 నాటికి పెండింగ్లో ఉన్న 11 టీఎంసీల నీటిని వెంటనే విడుదల చేయాలని తమిళనాడు తన పిటిషన్లలో కోరింది. అంతేకాకుండా కర్ణాటక-తమిళనాడు సరిహద్దులోని బిల్లిగుండ్లు నీటి కొలత కేంద్రం వద్ద 10 రోజుల్లో రోజుకు 1.3 టీఎంసీల చొప్పున నీటిని విడుదల చేసేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. ఈ రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు అక్టోబర్ 12న తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.
అక్టోబర్ 8న కావేరీ జల నియంత్రణ కమిటీ (CWRC) నీటి కొరతను భర్తీ చేయాలని కర్ణాటకను ఆదేశించలేదని తమిళనాడు ప్రభుత్వం ఆరోపించింది. పైగా అక్టోబర్ 9 నుంచి నీటి విడుదలను సెకనుకు 4,000 క్యూసెక్కుల నుంచి 3,000 క్యూసెక్కులకు తగ్గించిందని పేర్కొంది.
సెప్టెంబర్ 24న కావేరీ జల నిర్వహణ అథారిటీ (CWMA) తీసుకున్న నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వం అమలు చేసేలా ఆదేశించాలని తమిళనాడు కోరింది. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 7 వరకు నీటిని విడుదల చేయకపోవడం వల్ల ఏర్పడిన 0.94 టీఎంసీల లోటును భర్తీ చేయాలని విజ్ఞప్తి చేసింది. అక్టోబర్ 8న CWMA సమావేశంలో నిర్ణయించిన మేరకు తదుపరి నీటి ప్రవాహాన్ని కూడా కొనసాగించాలని కోరింది.
కావేరీ నీటి వాటా సక్రమంగా అందడం లేదని, నీటి విడుదలలో లోటు ఉందని ఆరోపిస్తూ తమిళనాడు ప్రభుత్వం సెప్టెంబర్ 24న కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన ధర్మాసనం కర్ణాటక ప్రభుత్వ వివరణ కోరింది. తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే నీటి కొరత కారణంగా ముందస్తు ఖరీఫ్ పంటను కోల్పోయామని కోర్టుకు తెలిపింది. అయితే కర్ణాటక మాత్రం రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని, ఈ పరిస్థితుల్లో తమిళనాడు కోరుతున్న స్థాయిలో నీటిని విడుదల చేయడం సాధ్యం కాదని వాదించింది.
Also Read:రాజీనామా చేస్తే..తప్పు చేసినట్లు కాదు!
అంతకుముందు ఆగస్టు 3న కూడా తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కావేరీ జల నియంత్రణ కమిటీ కేటాయించిన నీటి పరిమాణం చాలా తక్కువగా ఉందని, పొరుగు రాష్ట్రమైన కర్ణాటక విడుదల చేస్తున్న నీరు కూడా తమ అవసరాలకు సరిపోవడం లేదని తన పిటిషన్లో పేర్కొంది.

