స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (FTAs) కోసం వివిధ దేశాలు భారత్ తో ట్రేడ్ డీల్ కు ఆసక్తి కనబరుస్తున్నాయని కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
న్యూఢిల్లీలో జరిగిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ,వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) మరియు వార్షిక సదస్సు ముగింపు సమావేశంలో గోయల్ మాట్లాడుతూ నేను వెళ్లే ప్రతి చోటా మొదటి డిమాండ్, మేము మీతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నాము అన్నారు.
తన ఇటీవలి ఈజిప్ట్ పర్యటనను ప్రస్తావిస్తూ ప్రాధాన్య వాణిజ్య ఒప్పందం (PTA) లేదా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) అవకాశాలను పరిశీలించి, నిబంధనలను ఖరారు చేయాలని ఇరు దేశాలు తమ అధికారులను కోరినట్లు గోయల్ చెప్పారు. ఈజిప్ట్‌లో కూడా మేము ప్రకటించాము… మా బృందాలు కలిసి సంభావ్య ప్రాధాన్య వాణిజ్య ఒప్పందం లేదా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని అధ్యయనం చేసి నిబంధనలను ఖరారు చేస్తాయి అని తెలిపారు. భారత్-యూరోపియన్ యూనియన్ (EU) ఎఫ్‌టీఏ సంతకం మరియు అమలు కోసం అక్కడి వ్యాపార వర్గాలు ఎదురుచూస్తున్నాయని ఇటలీలో కూడా ఇదే ఆసక్తి కనిపించిందని ఆయన పేర్కొన్నారు. ఈ వాణిజ్య ఒప్పందాల నెట్వర్క్ భారతీయ వ్యాపారాలకు అంతర్జాతీయ మార్కెట్లను చేరుకునే అవకాశాలను కల్పిస్తోందన్నారు.
భారత్ ప్రాధాన్య మార్కెట్ యాక్సెస్ విస్తరణను హైలైట్ చేస్తూ 2014కు ముందు 10 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో పోలిస్తే ప్రస్తుతం మన వాణిజ్య ఒప్పందాలు దాదాపు 70 ట్రిలియన్ డాలర్ల ప్రపంచ జీడీపీ ప్రాతినిధ్యం వహించే మార్కెట్లను కవర్ చేస్తున్నాయని మంత్రి చెప్పారు. వచ్చే ఏడాది, ఏడాదిన్నర కాలంలో, ఎనిమిది లేదా తొమ్మిది ఇతర ప్రాంతాలతో ద్వైపాక్షిక, బహుళపాక్షికంగా మనం చేస్తున్న చర్చల ద్వారా మరో 15 ట్రిలియన్ల మార్కెట్ మీ అందరికీ అందుబాటులోకి వస్తుంది అన్నారు. అంతిమంగా భారత్‌కు 85 ట్రిలియన్ డాలర్లు—అంటే ప్రపంచ జీడీపీలో 76 శాతం—ప్రాతినిధ్యం వహించే మార్కెట్లకు ప్రాధాన్య ప్రవేశం లభించవచ్చని గోయల్ తెలిపారు.
Also Read:EPFO New Rules:ఈపీఎఫ్ విత్‌డ్రా..కొత్త రూల్స్
ప్రపంచాన్ని మనపై ఆధారపడేలా చేయడం: ఇతర ఆర్థిక వ్యవస్థలపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా, ప్రపంచాన్ని భారత్‌పై మరింత ఆధారపడేలా మార్చే దిశగా మన విధానం ముందుకు సాగాలని ఆయన అన్నారు.

