భారీ బడ్జెట్, స్టార్ హీరోలు, ప్రముఖ నిర్మాణ సంస్థల అండ లేకపోయినా మంచి సినిమాలు విజయం సాధించగలవని ‘హనుమాన్ అన్ష్’ నిరూపించిందని ఆ చిత్ర దర్శకుడు విశాల్ చతుర్వేది అన్నారు. ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత ప్రేరణతో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఇంతటి విజయం అందుకున్నప్పటికీ బాలీవుడ్లోని పెద్ద నిర్మాణ సంస్థల నుంచి కనీస ప్రశంసలు కూడా రాలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
షోభినవ్ సత్యా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా నవంబర్ 27 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సినిమా విజయం సాధించాలంటే భారీ బడ్జెట్, స్టార్ హీరోలు, పెద్ద నిర్మాణ సంస్థల అండ తప్పనిసరి అనే అభిప్రాయాన్ని ‘హనుమాన్ అన్ష్’ చెరిపేసిందని విశాల్ అన్నారు. సినిమా అనేది ప్రజలకు సంబంధించిన మాధ్యమమని, ప్రేక్షకులే ఏ సినిమా బాగుందో నిర్ణయిస్తారని తెలిపారు.
గతంలో విమర్శకులు, సోషల్ మీడియా ప్రభావంతో సినిమాలపై అభిప్రాయాలు ఏర్పడేవని, ఇప్పుడు ప్రేక్షకులే నేరుగా సినిమాను ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. ఈవెంట్ సినిమాలే థియేటర్లలో విజయవంతమవుతాయనే అభిప్రాయం కూడా తమ సినిమా తప్పని నిరూపించిందని చెప్పారు.’హనుమాన్ అన్ష్’ విడుదలకు ముందు సినీ పరిశ్రమ నుంచి ఆశించినంత మద్దతు లభించలేదని గతంలోనే విశాల్ చతుర్వేది వెల్లడించారు. సినిమా భారీ విజయం సాధించిన తర్వాత అయినా బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు స్పందించాయా? అనే ప్రశ్నకు ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
పెద్ద సినిమాలు విజయవంతమైనప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థలు అధికారిక ప్రకటనలు విడుదల చేస్తుంటాయని, కానీ తమ సినిమా విషయంలో ఒక్క పెద్ద నిర్మాణ సంస్థ కూడా ప్రశంసిస్తూ ప్రకటన చేయలేదని అన్నారు. తాను కొత్త దర్శకుడిని కావడం, తమది చిన్న సినిమా కావడం దీనికి కారణమై ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.
Also Read:రాజీనామా చేస్తే..తప్పు చేసినట్లు కాదు!
అయితే వరుణ్ ధావన్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి కొందరు ప్రముఖులు మాత్రం సినిమా విజయాన్ని బహిరంగంగా ప్రశంసించారని చెప్పారు. వ్యక్తిగతంగా కలిసినప్పుడు చాలామంది అభినందిస్తున్నప్పటికీ, పెద్ద నిర్మాణ సంస్థల నుంచి అధికారిక స్పందన లేకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కించిన రణ్బీర్ కపూర్, సాయిపల్లవి, యష్ నటించిన ‘రామాయణ్: పార్ట్ 1’ సినిమాను ఇంకా చూడలేదని విశాల్ తెలిపారు. అయితే ఆ సినిమా చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

