తన అధికారిక నివాసంలో కాలిపోయిన నగదు నోట్ల కట్టలు లభించిన ఘటనకు సంబంధించిన ఆరోపణల్లో తాను నిర్దోషినని అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ స్పష్టం చేశారు. హైకోర్టు న్యాయమూర్తి పదవికి తాను రాజీనామా చేయడాన్ని తప్పు చేసినట్లు అంగీకరించినట్లుగా లేదా తనపై వచ్చిన ఆరోపణలను ఒప్పుకున్నట్లుగా భావించకూడదని తెలిపారు.
ఈ మేరకు సెప్టెంబర్ 10న లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్కు ఆయన లేఖ రాశారు. ఏప్రిల్ 9న తాను రాజీనామా చేసినందున తనను పదవి నుంచి తొలగించేందుకు చేపట్టిన ప్రక్రియలకు ఇకపై చట్టపరమైన ప్రాధాన్యం లేదని వర్మ పేర్కొన్నారు. తనను తొలగించేందుకు చేసే ఏ ప్రయత్నమైనా రాజ్యాంగపరమైన ఆధారాలు లేనిదేనని వాదించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 217(1)(a)తో పాటు 1978లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ‘యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ గోపాల్ చంద్ర మిశ్రా’ తీర్పును ఆయన ప్రస్తావించారు. హైకోర్టు న్యాయమూర్తి రాజీనామా స్వతహాగా అమల్లోకి వస్తుందని, దానికి రాష్ట్రపతి లేదా మరే ఇతర అధికారుల ఆమోదం అవసరం లేదని వివరించారు.
నేను రాజీనామా చేసిన వెంటనే నన్ను పదవి నుంచి తొలగించేందుకు ఉద్దేశించిన ప్రక్రియలు కొనసాగించే అవకాశం లేకుండా పోయింది. వాటిని ఇకపై కొనసాగించలేరు’ అని తన లేఖలో పేర్కొన్నారు. న్యాయమూర్తులను తొలగించేందుకు సంబంధించిన రాజ్యాంగ నిబంధనలు పదవిలో కొనసాగుతున్న న్యాయమూర్తులకు మాత్రమే వర్తిస్తాయని, పదవిని విడిచిపెట్టిన వారికి వర్తించవని వాదించారు.
ALso Read:EPFO New Rules:ఈపీఎఫ్ విత్డ్రా..కొత్త రూల్స్

