ఢిల్లీలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) సందర్భంగా తొలగించిన ఓటర్ల పేర్ల పునరుద్ధరణకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకంగా స్పందించింది. గతంలో ఓటర్ల జాబితాలో పేర్లు ఉండి, ఎస్ఐఆర్ ప్రక్రియలో తొలగింపునకు గురైనవారిని మళ్లీ ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు కొత్త దరఖాస్తుదారులుగా పరిగణించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు హామీ ఇచ్చింది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఓటర్ల జాబితాలో పేర్లు కోల్పోయినవారు తిరిగి తమ పేర్లను చేర్చుకోవడానికి ఫారం-6 సమర్పించాల్సి వస్తోందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, నేహా రాఠీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
సాధారణంగా కొత్తగా ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకునేవారు ఫారం-6 సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ఎస్ఐఆర్ ప్రక్రియలో పేర్లు తొలగించబడినప్పటికీ గతంలో ఓటర్లుగా నమోదైనవారు కూడా ఇదే ఫారం సమర్పించాల్సి రావడంపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.ఫారం-6లో తొలిసారిగా ఓటర్ల జాబితాలో పేరు చేర్చుకోవడానికి దరఖాస్తు చేస్తున్నట్లు ప్రకటించాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు. గతంలోనే ఓటర్లుగా నమోదైనవారు ఇలా ప్రకటించడం వాస్తవాలకు విరుద్ధమని వాదించారు.
అంతేకాకుండా తప్పుడు ప్రకటన చేసినట్లు భావిస్తే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 31 కింద శిక్షకు గురయ్యే ప్రమాదం ఉందని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఓటర్లుగా నమోదై, ఎస్ఐఆర్ కారణంగా పేర్లు కోల్పోయినవారి కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని పిటిషనర్లు కోరారు. చిరునామా మారిన ఓటర్ల కోసం ఉపయోగించే ఫారం-8 ద్వారా పేర్ల పునరుద్ధరణకు అవకాశం కల్పించాలని లేదా ఇందుకోసం ప్రత్యేక ఫారాన్ని రూపొందించాలని సూచించారు.
ఎస్ఐఆర్ మార్గదర్శకాల ప్రకారం ఫారం-6తో పాటు అదనపు ప్రకటనను సమర్పించాలనే నిబంధనపైనా వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అదనపు ప్రకటనకు చట్టబద్ధత లేదని, దాని ఆధారంగా అర్హులైన ఓటర్ల దరఖాస్తులను తిరస్కరించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ వ్యవహారంలో కోర్టు తదుపరి విచారణలో ఇచ్చే ఆదేశాలు ఢిల్లీలో ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
Also Read;SIRపై సుప్రీంకు ఒవైసీ

