కేంద్ర ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఇండియా కూటమి చేపడుతున్న నిరసనలకు పండుగల నేపథ్యంలో తాత్కాలిక విరామం లభించనుంది. అయితే ఈ విరామం వెనక్కి తగ్గడం కాదని, తమ పోరాటం కొనసాగుతుందని ప్రతిపక్ష కూటమి స్పష్టం చేస్తోంది. ఢిల్లీలో వరుసగా ఐదు రోజుల పాటు నిరసన ర్యాలీలు నిర్వహించడంతో పాటు, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్), సీఈసీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన ఇండియా కూటమి నేతల సమావేశంలో పండుగల సమయంలో ప్రతిరోజూ సంయుక్త నిరసన ర్యాలీలు నిర్వహించడం కష్టమని అభిప్రాయపడినట్లు ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. దుర్గాపూజ, దసరా, దీపావళి, ఛఠ్ పండుగల నేపథ్యంలో ఆందోళనలను కొంతకాలం తగ్గించాలని నేతలు నిర్ణయించినట్లు సమాచారం. ఇకపై రోజువారీ నిరసనలకు బదులుగా సందర్భానుసారంగా ఆందోళనలు నిర్వహించే అవకాశం ఉంది.
నేతల సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రతిపక్షాల పోరాటం కొనసాగుతుందని సంకేతాలిచ్చారు. నిరసనలు రేపు జరిగినా, కొన్ని నెలల తర్వాత జరిగినా తమ పోరాటం మాత్రం ఆగదని స్పష్టం చేశారు. త్వరలో ఒక ‘సర్‌ప్రైజ్’ ఉంటుందని సూచించిన ఆయన.. దానికి సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసనలు చేపట్టడంపై విధించిన ఆంక్షలను కూడా సవాలు చేస్తామని తెలిపారు.
ఢిల్లీలో గత వారం రోజులుగా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. సుప్రీంకోర్టు వరకు ర్యాలీ నిర్వహించడం, ఎస్‌ఐఆర్ ప్రక్రియతో పాటు సీఈసీ వ్యవహారాన్ని సవాలు చేస్తూ న్యాయపోరాటానికి దిగడం ఈ ఆందోళనల్లో కీలక పరిణామాలుగా నిలిచాయి.పండుగల సమయంలో నాయకులు, కార్యకర్తలు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లాల్సి ఉండటంతో నిరసనలను ఎలా కొనసాగించాలనే అంశంపై ఇండియా కూటమి దృష్టి సారించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పార్టీలు తమ రాజకీయ కార్యకలాపాలపైనా దృష్టి పెట్టాల్సి ఉంది.
దసరాకు ముందు ఢిల్లీలో భారీ స్థాయి నిరసన జరిగే అవకాశం లేదని, అయితే తదుపరి ఆందోళనలకు సంబంధించిన ప్రణాళికలు కొనసాగుతున్నాయని ఇండియా టుడే నివేదించింది. నిరసనకు కొద్దిసేపటి ముందు తదుపరి కార్యాచరణను ప్రకటించడం ద్వారా ప్రత్యర్థులకు ముందస్తు సమాచారం అందకుండా చూడాలని ప్రతిపక్షాలు భావిస్తున్నట్లు పేర్కొంది.
Also Read:SIRపై సుప్రీంకు ఒవైసీ
ఢిల్లీలో వరుసగా నిర్వహించిన నిరసనలతో వచ్చిన రాజకీయ ఊపును దీర్ఘకాలిక ఉద్యమంగా మార్చడం ఇప్పుడు ఇండియా కూటమికి సవాలుగా మారింది. రోజువారీ ఆందోళనలకు తాత్కాలిక విరామం ఇచ్చినప్పటికీ, న్యాయపోరాటం, పార్టీల మధ్య సమన్వయం, పౌర సమాజ సంస్థల భాగస్వామ్యంతో ఈ అంశాన్ని ప్రజల్లో సజీవంగా ఉంచాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.

