CEC జ్ఞానేశ్ కుమార్‌కు మద్దతుగా హిందూ సంఘాలు

3
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ వ్యవహారంపై రాజకీయ వాతావరణం తీవ్రంగా వేడెక్కింది. ఓటర్ల జాబితాల సమగ్ర రివిజన్ (SIR) ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఒకవైపు విపక్షాలు, విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తుండగా.. మరోవైపు సీఈసీకి మద్దతుగా అగర్వాల్, వైశ్య మరియు వివిధ హిందూ సంఘాలు ఢిల్లీ వేదికగా భారీ నిరసన ప్రదర్శన చేపట్టాయి.

గ్లోబల్ వైశ్య ఫెడరేషన్, అగర్వాల్ సంఘాలు మరియు హిందూ సంఘాల ఆధ్వర్యంలో బిజెపి నేత జై భగవాన్ గోయల్ నాయకత్వంలో ఈ మద్దతు ర్యాలీ జరిగింది.ఎన్నికల కమిషన్ చేపట్టిన ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతోందని హిందూ సంఘాలు స్పష్టం చేశాయి.

ఓటర్ల జాబితాలోని బోగస్ ఓటర్లు, బంగ్లాదేశీ చొరబాటుదారులు, అక్రమ ఓట్లను ఏరివేసేందుకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నందుకు సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.ఎన్నికల కమిషన్ చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియలో దేశవ్యాప్తంగా దాదాపు 13 కోట్ల మంది పేర్లను తొలగించడంపై అధికార, విపక్షాల మధ్య తీవ్ర స్థాయి లో వాగ్వాదం నడుస్తోంది.

ఏళ్లుగా జాబితాలో ఉన్న 2.8 కోట్ల మంది మృతుల ఓట్లను, ద్వంద్వ ఓట్లను (Duplicate Voters) మాత్రమే తొలగించామని అధికార పక్షం స్పష్టం చేసింది.మిగిలిన 10.2 కోట్ల మంది అర్హులైన ఓటర్ల పేర్లను ఎందుకు తొలగించారంటూ కాంగ్రెస్, ఇండియా బ్లాక్ నేతలు నిలదీస్తున్నారు. సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ మరియు ఈసీ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చారు.

Also Read:పొంగులేటిపై ఈడీకి బీఆర్ఎస్ ఫిర్యాదు

మరోవైపు, ఎన్నికల కమిషన్‌లో అంతర్గత నిర్ణయాల విషయంలో ఇతర కమిషనర్ల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయనే వార్తలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల కమిషన్ స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తున్నారని కాంగ్రెస్ విమర్శిస్తుంటే.. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకే ఎస్ఐఆర్ తెచ్చామని ప్రభుత్వం మద్దతుగా నిలుస్తోంది.ఒకే అంశంపై సీఈసీకి మద్దతుగా ఒక వర్గం, వ్యతిరేకంగా విపక్షాలు రోడ్డెక్కడంతో ఢిల్లీలో రాజకీయం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.

- Advertisement -