తెలంగాణ నూనెగింజల సహకార సమాఖ్య (TGOILFED) కు చెందిన కోట్లాది రూపాయల విలువైన భూములను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఆయన సోదరులు దోచుకునేందుకు కుట్ర పన్నుతున్నారని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. జీవో 85 (GO 85) ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తోందని మండిపడ్డారు.
ఆయిల్ ఫెడ్ భూముల కేటాయింపులకు సంబంధించిన చారిత్రక అంశాలను ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ వివరించారు. నూనె ఉత్పత్తి (Oil Extraction) వంటి అవసరాల కోసం 17,261 గజాల స్థలాన్ని అప్పట్లో ఒక ప్రైవేట్ వ్యక్తికి కేటాయించారు. ఆయిల్ ఉత్పత్తికి కాకుండా ఇతర అవసరాలకు, లీజులకు ఇవ్వడంతో 1974లో ప్రభుత్వం ఆ భూ కేటాయింపును రద్దు చేసింది. రద్దు చేసిన భూమిలో నుండి 15,983 గజాల స్థలాన్ని 1990లో ఆంధ్రప్రదేశ్ ఆయిల్ ఫెడ్ (OILFED) సంస్థకు కేటాయించారు.
టీడీపీ పాలన నుంచి నేటి కాంగ్రెస్ పాలన వరకు ఈ భూములను కాజేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని శ్రవణ్ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో ఆయిల్ ఫెడ్ నుంచి ఈ విలువైన భూములను ఖాళీ చేయించే కుట్ర చేశారు. అయితే కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఈ భూములు ప్రభుత్వ సంస్థ అయిన ఆయిల్ ఫెడ్ వద్దే ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కానీ, ప్రస్తుతం రేవంత్ రెడ్డి సరిగ్గా చంద్రబాబు దారినే అనుసరిస్తూ.. జీవో 85 ద్వారా ఈ భూములను మళ్లీ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్రలు ప్రారంభించారు అన్నారు.
దాదాపు 17 వేల గజాల అత్యంత విలువైన ఈ TGOILFED భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వాడుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారని శ్రవణ్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి సోదరులు ఇప్పటికే ఈ భూమి వద్ద రెక్కీ నిర్వహించి, కబ్జా చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని ఆరోపించారు.ప్రభుత్వ ఆస్తులను, ప్రజా ధనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు, సొంత కుటుంబ సభ్యులకు కట్టబెట్టే ఈ దోపిడీని బీఆర్ఎస్ ఊరుకోదని, ప్రజాక్షేత్రంలోనూ, చట్టపరంగానూ అడ్డుకుంటామని దాసోజు శ్రవణ్ హెచ్చరించారు.
Also Read:CEC జ్ఞానేశ్ కుమార్‌కు మద్దతుగా హిందూ సంఘాలు

