బీజేపీ గెలిచింది…కానీ!

1
- Advertisement -

రాజస్థాన్ పట్టణ స్థానిక సంస్థల (Urban Local Body) ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. స్థూలంగా చూస్తే అధికార భారతీయ జనతా పార్టీ (BJP) ఎక్కువ స్థానాలను గెలుచుకుని ముందంజలో ఉన్నప్పటికీ ఫలితాల లోతుల్లోకి వెళ్తే భజన్ లాల్ శర్మ ప్రభుత్వానికి అనేక కలవరపెట్టే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.

ప్రకటించిన 10,235 వార్డుల్లో బీజేపీ 4,179 వార్డులను దక్కించుకోగా కాంగ్రెస్ 3,613 వార్డులను గెలుచుకుంది. స్వతంత్రులు (Independents) ఏకంగా 2,273 వార్డుల్లో గెలిచి ఇరు పార్టీలకు షాక్ ఇచ్చారు. బీజేపీకి 35.19% ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 34.25% ఓట్లు లభించాయి. రెండింటి మధ్య వ్యత్యాసం కేవలం 0.94% (సుమారు 99,615 ఓట్లు) మాత్రమే. స్వతంత్ర అభ్యర్థులు 27.38% ఓట్లు సాధించి ఎన్నికల సమీకరణాలను తలకిందులు చేశారు.

రాష్ట్రంలోని 10 మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ కేవలం 4 (జైపూర్, ఉదయ్‌పూర్, కోటా, భిల్వారా) చోట్ల మాత్రమే స్పష్టమైన మెజారిటీ సాధించగా, కాంగ్రెస్ 1 (బికనేర్) చోట గెలిచింది. మిగిలిన చోట్ల స్వతంత్రుల పాత్ర కీలకంగా మారింది.

సీఎం భజన్ లాల్ శర్మ సొంత జిల్లా భరత్‌పూర్ కార్పొరేషన్‌లో మొత్తం 65 వార్డులు ఉండగా స్వతంత్రులు 36 వార్డులు గెలుచుకుని ఆధిపత్యం ప్రదర్శించారు. ఇక్కడ బీజేపీ కేవలం 20, కాంగ్రెస్ 7 స్థానాలకే పరిమితమయ్యాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ రాథోడ్ సొంత ప్రాంతం పాలి మున్సిపల్ కార్పొరేషన్‌లో 65 వార్డులకు గానూ కాంగ్రెస్ 29 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలవగా, బీజేపీ 21 స్థానాలతో సరిపెట్టుకుంది.

మాజీ సీఎం వసుంధర రాజే అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఝాలవాడ్ మున్సిపల్ కౌన్సిల్‌లో కాంగ్రెస్ 29 వార్డులు గెలుచుకోగా, బీజేపీ కేవలం 13 స్థానాలకే పరిమితమై భంగపడింది. నిరసనలు, తిరుగుబాట్ల కారణంగా రెండు పార్టీలలోనూ రెబెల్స్ స్వతంత్రులుగా పోటీ చేసి ఓట్లను భారీగా చీల్చారు. తమకు నష్టం జరిగేలా బీజేపీ ప్రభుత్వం అక్రమంగా వార్డుల పునర్విభజన చేసిందని, లేకపోతే కాంగ్రెస్ మరో 1,500 వార్డులను గెలుచుకునేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతాస్రా ఆరోపించారు.

యూజీసీ ఈక్విటీ నిబంధనలకు వ్యతిరేకంగా ‘కర్ణి సేన’ వంటి అగ్రవర్ణ సంఘాలు చేసిన నిరసనల ప్రభావం పడింది. తాము మద్దతు ఇచ్చిన స్వతంత్రులలో 70 శాతానికి పైగా అభ్యర్థులు గెలిచారని కర్ణి సేన పేర్కొంది. దళిత, గిరిజన సామాజిక వర్గాలకు కేటాయించిన రిజర్వుడ్ స్థానాల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించి తన సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకుంది.

Also Read:కాంగ్రెస్ పథకాలు..ట్రంప్ కాపీ!

సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి బలం ఎక్కువై ఉండడం, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలకే ఓటర్లు మొగ్గు చూపడం ఆనవాయితీ. కానీ ప్రభుత్వం వచ్చి సగం కాల పరిమితి పూర్తయ్యే సరికి కాంగ్రెస్ ఇంత గట్టి పోటీ ఇవ్వడం, స్వతంత్రులు భారీగా పుంజుకోవడం రాబోయే పంచాయతీరాజ్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వానికి ఒక గంభీరమైన హెచ్చరికే అని విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -