కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ త్వరలో విడుదల చేయబోయే ఆత్మకథ ‘బిలాంగింగ్’ (Belonging) పుస్తకానికి సంబంధించిన భారత పబ్లిషింగ్ హక్కుల వ్యవధిలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పుస్తకంలోని “పలు అధ్యాయాల్లో” మార్పులు, కొన్ని భాగాలను పూర్తిగా తొలగించాలని పబ్లిషింగ్ సంస్థ ‘పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా’ న్యాయవాదులు కోరినట్లు తెలిసింది.
గత రెండు నెలలుగా ఈ మార్పులపై పబ్లిషర్లు, రచయిత్రుల బృందం మధ్య చర్చలు జరిగినప్పటికీ, చివరికి సమ్మతి కుదరకపోవడంతో ఈ పుస్తకాన్ని భారత్‌లో ప్రచురించబోమని పెంగ్విన్ ఇండియా ప్రకటించిన సంగతి తెలిసిందే.
పెంగ్విన్ ఇండియా లీగల్ టీమ్ సిద్ధం చేసిన జాబితాలో కొన్ని కీలక రాజకీయ అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం.ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావన మరియు ఆయన 12 ఏళ్ల పాలన…రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) పాత్ర,దేశంలో చోటుచేసుకున్న మతపరమైన విభజనలు, అల్లర్లు మరియు మైనార్టీల పరిస్థితి,గాల్వాన్ లోయలో భారత్-చైనా సరిహద్దు వివాదాలు, తాజా రాజకీయ పరిణామాలు ఉన్నాయి.
సోనియా గాంధీ తరఫున ఈ పుస్తక వ్యవహారాలను పర్యవేక్షించిన బృందం, పబ్లిషర్ న్యాయవాదులు అతిగా స్పందిస్తున్నారని అభిప్రాయపడింది. వారు కోరిన విధంగా మార్పులు, తొలగింపులు చేస్తే.. ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే పుస్తక ప్రపతికి, భారత్‌లో అచ్చయ్యే ప్రపతికి మధ్య వ్యత్యాసాలు వస్తాయని ఇది భారత్‌లోని పాఠకులకు పక్షపాతంగా మారుతుందని వాదించారు.
ఈ వివాదంపై పెంగ్విన్ ఇండియా స్పందిస్తూ.. తమపై ఎలాంటి ప్రభుత్వ ఒత్తిళ్లు లేవు అని స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారమే రచయిత్రితో చర్చలు జరిగాయని, అయితే ఒక నిర్దిష్ట అంశంపై ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్లే ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చిందని వివరించింది. కాగా అమెరికాలో ‘ఆల్‌ఫ్రెడ్ ఎ నాఫ్’ (Alfred A. Knopf) సంస్థ ద్వారా నవంబర్ 10న అంతర్జాతీయంగా ఈ పుస్తకం యథాతథంగా విడుదల కానుంది.
Also Read:రాహుల్ అసత్యప్రచారం..మోదీ ఫైర్

