E-20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సంచలనం

3
- Advertisement -

ఇథనాల్ 20 శాతం కలిపిన E-20 పెట్రోల్ అమలును బలవంతంగా రుద్దడానికి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గూండాగిరీకి పాల్పడుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఆరోపించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన కేజ్రీవాల్…కేంద్ర ప్రభుత్వ ఈ నిర్ణయం వల్ల 2023 కంటే ముందు తయారైన దాదాపు 30 కోట్ల వాహనాలు “స్క్రాప్ (చెత్త)”గా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా, దీనిపై మాట్లాడకుండా ఆటోమొబైల్ కంపెనీలను కేంద్ర ప్రభుత్వం బెదిరించి నోళ్లు మూయిస్తోందని ఆరోపించారు.

ఈ ఇథనాల్ మిశ్రమ ఇంధనంపై కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ.. E-20 పెట్రోల్‌ను రుద్దడానికి మోదీ ప్రభుత్వం గుండాగిరీ స్థాయికి దిగజారింది. కొన్ని రోజుల క్రితం, నేను 29 ఆటోమొబైల్ కంపెనీలకు లేఖ రాశాను. 2023 కంటే ముందు తయారు చేసిన వాహనాల్లో E-20 ఇంధనాన్ని ఉపయోగించవచ్చా అని ప్రశ్నించాను. ఒకవేళ ఆ వాహనాలు పాడైపోయినా లేదా మైలేజ్ తగ్గినా కంపెనీలు పరిహారం చెల్లిస్తాయా అని కూడా అడిగాను. అధికారికంగా ఏ కంపెనీ కూడా సమాధానం ఇవ్వలేదు, కానీ నేను 9 కంపెనీల అధికారులతో వ్యక్తిగతంగా మాట్లాడాను అని తెలిపారు.

ఆటోమొబైల్ కంపెనీలు తీవ్ర భయాందోళనల మధ్య పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. మోదీ ప్రభుత్వం తమను బెదిరిస్తోందని ఆ కంపెనీల ప్రతినిధులు నాతో చెప్పారు. 2023కి ముందు తయారైన వాహనాల్లో E-20 వాడటం వల్ల ఇంజన్లు దెబ్బతింటాయని, మైలేజ్ తగ్గుతుందని వారు అంగీకరించారు. కానీ, ‘మేము నోరు విప్పితే మా పని అయిపోయినట్లే.. వారు మా ప్లాంట్లను మూసివేయిస్తారు లేదా ఈడీ (ED) దాడులు చేయిస్తారు’ అని వారు వాపోయారు. 2023 పూర్వపు 30 కోట్ల వాహనాలను స్క్రాప్‌గా మార్చడానికి మోదీ జీ పట్టుబట్టారు అని కేజ్రీవాల్ విమర్శించారు.

ఇథనాల్ వల్ల కలిగే ప్రయోజనాలను కేజ్రీవాల్ ప్రశ్నిస్తూ.. దీనివల్ల విదేశీ మారకద్రవ్యంలో ఎలాంటి ప్రయోజనం లేదు మరియు ఇది భూగర్భ జలాలను క్షీణింపజేస్తుంది. మరి మోదీ జీ ఎందుకు అంత పట్టుదలతో ఉన్నారు? మేము E-20 అంశంపై ఒక టౌన్ హాల్ సమావేశాన్ని ప్లాన్ చేసాము, కానీ మా అనుమతిని రద్దు చేయడానికి పోలీసులు కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌కు చేరుకున్నారు. ఇంండోర్ (ఇంటి లోపల) కార్యక్రమాలకు సంబంధించి మాకు గతంలో ఎన్నడూ అనుమతి అవసరం రాలేదు. మోదీ జీ, మీరు ఈ E-20 నిర్ణయాన్ని గౌరవప్రదంగా వెనక్కి తీసుకోవాలి, లేదంటే మేము మిమ్మల్ని దానికి బలవంతం చేస్తాము అని హెచ్చరించారు.

Also Read:విరాళాల చోరీ..SP ఎంపీల నిరసన

- Advertisement -