టీఎంసీ..మమతా చేజారేనా?

5
- Advertisement -

పశ్చిమ బెంగాల్ అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్ లో సంక్షోభం మరింత ముదిరింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల తిరుగుబాటు జరిగిన కొన్ని రోజులకే  ఇప్పుడు పార్లమెంట్‌లోనూ మమతా బెనర్జీకి ఊహించని షాక్ తగిలింది. లోక్‌సభలో ఉన్న 28 మంది టీఎంసీ ఎంపీలలో దాదాపు 20 మంది ఎంపీలు పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని లోక్‌సభ ఎంపీ కాకొలి ఘోష్ దస్తీదార్ ప్రకటించారు.

సోమవారం న్యూఢిల్లీలో మమతా బెనర్జీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీలు ‘ఇండియా’ (INDIA) కూటమి సమావేశానికి హాజరైన సమయంలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. తాము ఎన్డీయేకు మద్దతు ఇస్తున్నట్లు అధికారికంగా తెలియజేస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసినట్లు కాకొలి ఘోష్ తెలిపారు. అయితే తాము బీజేపీలో చేరడం లేదని కేవలం పశ్చిమ బెంగాల్ అభివృద్ధి కోసమే ఎన్డీయేకు మద్దతు ఇస్తున్నామని ఆమె స్పష్టం చేశారు.

ప్రస్తుతం తిరుగుబాటు ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాను కలవడానికి సమయం కోరారు. లోక్‌సభలో టీఎంసీ చీఫ్ విప్‌గా కాకొలి ఘోష్ దస్తీదార్ కొనసాగుతారని వారు వాదిస్తున్నారు. దీనికి భిన్నంగా మమతా బెనర్జీ వర్గం అసలు తిరుగుబాటు కంటే ముందే కాకొలి ఘోష్‌ను విప్ పదవి నుంచి తొలగించి, ఆమె స్థానంలో కల్యాణ్ బెనర్జీని నియమించినట్లు చెప్తోంది. దీనికి సంబంధించిన లేఖపై మే 29న స్పీకర్ కార్యాలయం నుంచి అందిన ముద్ర కూడా ఉందని పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్ ధృవీకరించారు.

Also Read:ఎంఎస్‌ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో రష్మిక?

- Advertisement -