ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళను తాకాయి. మూడు రోజులు ఆలస్యంగా రళ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ అధికారికంగా ప్రకటించింది. రుతుపవనాల రాకతో తీవ్రమైన వేసవి ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనాన్ని ఇవ్వడమే కాకుండా వ్యవసాయ రంగంలో కొత్త ఆశలను నింపింది.
సాధారణంగా జూన్ 1న కేరళలోకి ప్రవేశించాల్సిన రుతుపవనాలు ఈసారి మూడు రోజుల ఆలస్యంగా జూన్ 4న ప్రవేశించాయి. గత కొన్ని రోజులుగా కేరళ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటం, పశ్చిమ పవనాలు బలపడటం మరియు ఉపగ్రహ చిత్రాల ఆధారంగా రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు శాస్త్రవేత్తలు ధృవీకరించారు. రాబోయే 3-4 రోజుల్లో ఇవి మరింత ముందుకు సాగి, దక్షిణ ద్వీపకల్పంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ఐఎండీ పేర్కొంది.
దేశంలోని నికర సాగు భూమిలో సగానికి పైగా పంట పొలాలు సాగునీటి కోసం ఈ వర్షాలపైనే ఆధారపడి ఉన్నాయి. రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో ఖరీఫ్ పంటల సాగుపై ఆందోళన చెందిన రైతులకు, ఈ తాజా పరిణామం పెద్ద ఊరటను ఇచ్చింది. దేశవ్యాప్తంగా ప్రధాన జలాశయాలలో నీటి మట్టాలు పెరగడానికి కూడా ఈ వర్షాలు తోడ్పడనున్నాయి.
కేరళ అంతటా రాగల 48 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించారు.
Also Read:FD డిటైల్స్ మర్చిపోయారా..అయితే మీకోసమే?

