టీఎంసీకి రెబల్ ఎమ్మెల్యేలు గట్టి షాక్ ఇచ్చారు. ఆ పార్టీ గెలిచిన 80 మంది ఎమ్మెల్యేల్లో 58 మంది ఎమ్మెల్యేలు మమతాకు వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే.. మమతా బెనర్జీకి రాజకీయ భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పవని అర్థమవుతోంది.
మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్ తన 28 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రెబల్ ఎమ్మెల్యేలు రితబ్రత బెనర్జీని బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. స్పీకర్ రథీంద్ర బోస్ నుండి వీరికి గుర్తింపు లభించడంతో…పార్టీ శాసనసభ విభాగంపై మమత నియంత్రణ కోల్పోయారు.
1998లో పార్టీని స్థాపించిన తర్వాత మమతా బెనర్జీకి ఎదురైన మొదటి చీలిక ఇది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘోర పరాజయం పాలైన కొద్ది వారాలకే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడకుండా ఉండాలంటే అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ (54 మంది ఎమ్మెల్యేలు) ఈ తిరుగుబాటు వర్గానికి ఉంది. వీరికి 58 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు లభించింది.
ఈ తిరుగుబాటుపై పార్టీ నాయకత్వం వెంటనే స్పందిస్తూ…రాష్ట్రవ్యాప్తంగా అన్ని సంస్థాగత కమిటీలను రద్దు చేసింది. అయితే ఈ అసంతృప్తి కేవలం ఎమ్మెల్యేలకే పరిమితం కాకుండా పార్లమెంటు (ఎంపీల)కు కూడా పాకే అవకాశం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఒకవేళ ఇదే జరిగితే కేంద్రంలోని ఎన్డీయే (NDA) ప్రభుత్వానికి ఇది కలిసి వచ్చే అవకాశం ఉంది.
Also Read:FD డిటైల్స్ మర్చిపోయారా..అయితే మీకోసమే?

