ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి (మురుగన్) ఆలయంలో కొంతకాలంగా సాగుతున్న అర్చకుల అవినీతి…వీఐపీ దర్శనాల దందాపై దేవాదాయ శాఖ మంత్రి రమేష్ సంచలన రీతిలో విరుచుకుపడ్డారు. ఆలయంలో భక్తులను దోచుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన స్వయంగా ఒక స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి అవినీతి తిమింగలాలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
సామాన్య భక్తుడి రూపంలో మంత్రి..సాధారణ భక్తులకు ఆలయాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకోవాలని మంత్రి రమేష్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆయన ఎవరికీ సమాచారం ఇవ్వకుండా, ఎటువంటి భద్రతా సిబ్బంది లేకుండా కేవలం ఒక సామాన్య భక్తుడిలా తిరుచెందూరు ఆలయానికి చేరుకున్నారు. తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ముఖానికి మాస్క్ ధరించారు.
సాధారణ భక్తుల క్యూ లైన్ లో ఉన్న మంత్రిని గమనించిన ఒక ఆలయ అర్చకుడు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడు. గంటల తరబడి లైన్ లో ఉండే పని లేకుండా, నేరుగా వీఐపీ దర్శనం చేయిస్తానని మంత్రికి ఆశ చూపాడు. అందుకు ప్రతిఫలంగా రూ. 4,000 డిమాండ్ చేశాడు. అవినీతిని సాక్ష్యాధారాలతో సహా నిరూపించాలనుకున్న మంత్రి, దానికి అంగీకరించి ఆ అర్చకుడికి గూగుల్ పే ద్వారా రూ. 4,000 ఆన్లైన్ పేమెంట్ చేశారు.
Also Read:బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారా..ఈ తప్పులు అస్సలు చేయకండి!
డబ్బులు తీసుకున్న తర్వాత ఆ అర్చకుడు మంత్రిని ప్రత్యేక మార్గంలో తీసుకువెళ్లి స్వామివారి దర్శనం చేయించాడు. దర్శనం ముగిసిన వెంటనే మంత్రి రమేష్ తన ముఖానికి ఉన్న మాస్క్‌ను తొలగించారు. ఎదురుగా ఉన్నది స్వయంగా దేవాదాయ శాఖ మంత్రి అని తెలుసుకున్న సదరు అర్చకుడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. తీవ్ర భయంతో అక్కడి నుండి పరారయ్యేందుకు ప్రయత్నించినప్పటికీ, అప్పటికే అప్రమత్తమైన అధికారులు అతడిని అడ్డుకున్నారు. ఆలయాల్లో ఇటువంటి అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా సరే సహించేది లేదని ఈ సందర్భంగా మంత్రి హెచ్చరించారు.

