రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. కరువును తెచ్చింది అంటూ హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో గత కొన్ని రోజులుగా నెలకొన్న తీవ్ర తాగునీటి సమస్యపై శనివారం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హాజరై భక్తులకు, మహిళలకు మద్దతు ప్రకటించారు.
వార్డులో మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కనీసం తాగడానికి కూడా నీరు దొరకని పరిస్థితి ఏర్పడిందని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మాకు తాగునీరు రావట్లేదు.. అధికారులు పట్టించుకోవట్లేదు అంటూ మహిళలు ఖాళీ బిందెలను ప్రదర్శిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రజలకు కనీస అవసరమైన మంచినీటిని కూడా అందించలేని దుస్థితిలో మున్సిపల్ యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం ఉందని వారు మండిపడ్డారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. జమ్మికుంటలో మహిళలు తాగునీటి కోసం రోడ్డెక్కడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి, నిర్లక్ష్యానికి సజీవ నిదర్శనమని విమర్శించారు. ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న తరుణంలో ప్రజలకు తాగునీరు అందించకుండా ఇబ్బందులకు గురిచేయడం బాధాకరమన్నారు.
తక్షణమే జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని, యుద్ధప్రాతిపదికన ప్రజల ఇబ్బందులను పరిష్కరించాలని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం మరియు స్థానిక అధికారులను గట్టిగా డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజల తరపున ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Also Read:వెనక్కి తగ్గిన ‘పెద్ది’ నిర్మాతలు!

