బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారా..ఈ తప్పులు అస్సలు చేయకండి!

4
- Advertisement -

మీరు బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారా అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి. ఎందుకంటే షేర్ మార్కెట్ (Equity) హెచ్చుతగ్గులకు లోనవుతున్నప్పుడు లేదా నష్టాల్లో ఉన్నప్పుడు మన పెట్టుబడి పోర్ట్‌ఫోలియోకు స్థిరత్వాన్ని ఇచ్చేవి ‘బాండ్లు’ (Bonds). ఇవి పెట్టుబడికి భద్రతను ఇవ్వడమే కాకుండా స్థిరమైన ఆదాయాన్ని వడ్డీ రూపంలో అందిస్తాయి. అయితే బాండ్లు అనగానే చాలా మంది ఇవి వంద శాతం సురక్షితమైనవని భావించి కళ్ళు మూసుకుని పెట్టుబడి పెడుతుంటారు. కానీ సరైన అవగాహన లేకపోతే బాండ్లలో కూడా నష్టపోయే ప్రమాదం ఉంది.

() చాలా మంది తమ చేతిలో డబ్బులు ఉన్నప్పుడు ఏవో కొన్ని బాండ్లను కొనేస్తుంటారు. కానీ మీ పెట్టుబడి ఎల్లప్పుడూ మీ భవిష్యత్తు అంటే పిల్లల చదువు, పెళ్లి లేదా రిటైర్మెంట్ వంటి వాటికి అనుగుణంగా ఉండాలి. లక్ష్యాల ఆధారంగా పెట్టుబడి పెడితే.. ఆ లక్ష్య కాలపరిమితికి సరిపోయే బాండ్ టెన్యూర్‌ను (గడువును) ఎంచుకోవడం సులువవుతుంది. ఇది చిన్న చిన్న లాభాల కోసం మధ్యలోనే బాండ్లను అమ్మేయకుండా క్రమశిక్షణతో ఉండేలా చేస్తుంది.

()మార్కెట్లో వడ్డీ రేట్లు పెరిగితే బాండ్ ధరలు తగ్గుతాయి. వడ్డీ రేట్లు తగ్గితే బాండ్ ధరలు పెరుగుతాయి. మీరు ఎక్కువ కాలపరిమితి ఉన్న బాండ్ కొన్న తర్వాత మార్కెట్లో వడ్డీ రేట్లు పెరిగితే మీ బాండ్ మార్కెట్ విలువ పడిపోతుంది. ఒకవేళ అత్యవసరంగా మీరు ఆ బాండ్‌ను గడువు తీరకముందే అమ్మాలనుకుంటే నష్టపోవాల్సి వస్తుంది. అయితే గడువు ముగిసేవరకు (Maturity) ఉంచుకుంటే మాత్రం ఫేస్ వాల్యూ ప్రకారం పూర్తి డబ్బులు వస్తాయి.

()బాండ్లలో వడ్డీ రేటు ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. కానీ మీరు సంపాదించే నిజమైన లాభం (Real Return) అనేది బాండ్ వడ్డీ రేటు – ద్రవ్యోల్బణ రేటు పై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీ బాండ్ 8% వడ్డీ ఇస్తుండగా దేశంలో ద్రవ్యోల్బణం 6% ఉంటే.. మీ చేతికొచ్చే నికర లాభం కేవలం 2% మాత్రమే. ద్రవ్యోల్బణం పెరిగే కొద్దీ మీ డబ్బు విలువ తగ్గుతుందని గుర్తుంచుకోవాలి.

()మీరు బాండ్‌ను మెచ్యూరిటీ వరకు ఉంచుకుందామనే ఆలోచనతోనే కొని ఉండవచ్చు కానీ ఏదైనా అత్యవసర పరిస్థితి (Financial Emergency) వస్తే దానిని మార్కెట్లో అమ్మాల్సి రావచ్చు. అలాంటప్పుడు ఆ బాండ్‌కు మార్కెట్లో తగినంత మంది కొనుగోలుదారులు ఉండాలి. డిమాండ్ లేని బాండ్లను ఎవరూ కొనరు, ఒకవేళ కొన్నా చాలా తక్కువ ధరకు అడుగుతారు. దీనివల్ల మీకు నష్టం వాటిల్లుతుంది.

Also Read:‘ఇట్లు అర్జున’..ఫస్ట్ సింగిల్

()కొన్ని బాండ్లకు ‘కాల్ ఆప్షన్’ ఉంటుంది. అంటే బాండ్ గడువు ముగియక ముందే.. ఇన్వెస్టర్ల దగ్గర ఉన్న బాండ్లను వెనక్కి తీసుకుని వారికి డబ్బులు చెల్లించే హక్కు బాండ్ జారీ చేసిన కంపెనీకి ఉంటుంది. మార్కెట్లో వడ్డీ రేట్లు పడిపోయినప్పుడు లేదా కంపెనీలు పాత ఎక్కువ వడ్డీ ఉన్న బాండ్లను ఈ ఆప్షన్ ద్వారా వెనక్కి తీసేసుకుని.. తక్కువ వడ్డీతో కొత్త బాండ్లను జారీ చేస్తాయి. అందువల్ల బాండ్ కొనే ముందే అందులో ‘కాల్ ఆప్షన్’ ఉందో లేదో సరిచూసుకోండి.

() మీ వద్ద ఉన్న డబ్బు మొత్తాన్ని ఒకే కంపెనీ బాండ్లలో పెట్టకూడదు. స్థిర ఆదాయ మార్గాల కోసం ఈపీఎఫ్ (EPF), పీపీఎఫ్ (PPF), బ్యాంక్ ఎఫ్‌డీలు, ప్రభుత్వ చిన్న పొదుపు పథకాలతో పాటు బాండ్లను ఎంచుకోవాలి. కార్పొరేట్ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు (G-secs), స్టేట్ డెవలప్‌మెంట్ లోన్స్ (SDLs), పీఎస్‌యూ (PSU) బాండ్లలో విభజించి ఇన్వెస్ట్ చేయాలి. దీనివల్ల ఒక కంపెనీ నష్టపోయినా మీ మొత్తం పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది.

()ఏదైనా కంపెనీ బాండ్లను కొనే ముందు ఆ కంపెనీ వ్యాపారం స్థిరంగా ఉందా లేదా? లాభాల్లో నడుస్తోందా? మేనేజ్‌మెంట్ ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది? వంటి విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. గతంలో కొన్ని కంపెనీలు బాండ్ల ద్వారా ప్రజల నుండి భారీగా నిధులు వసూలు చేసి ఆ తర్వాత నష్టాల్లో మునిగిపోయి డిఫాల్ట్ అంటే చేతులెత్తేశాయి. కొన్ని కంపెనీలు మోసాలకు కూడా పాల్పడ్డాయి. కాబట్టి సరైన రీసెర్చ్ చేయడం తప్పనిసరి.

()ఎక్కువ వడ్డీ వస్తుందని ఆశపడి తక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్న బాండ్లలో పెట్టుబడి పెట్టడం అతిపెద్ద తప్పు. AAA రేటింగ్…అత్యున్నత భద్రతను సూచిస్తుంది. ఇందులో రిస్క్ చాలా తక్కువ కాబట్టి వడ్డీ రేటు కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. రేటింగ్ తగ్గేకొద్దీ (AA, A, BBB..) కంపెనీ డిఫాల్ట్ అయ్యే ప్రమాదం (రిస్క్) పెరుగుతుంది. అందుకే ఆ రిస్క్‌కు పరిహారంగా వారు ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తారు. మీరు రిస్క్ తీసుకోలేని వారైతే కేవలం AAA లేదా AA రేటింగ్ ఉన్న బాండ్లనే ఎంచుకోండి. ఎక్కువ వడ్డీ ఆశ చూపిస్తున్నారనే కారణంతో గ్రౌండ్ రియాలిటీ చూడకుండా మోసపోకండి.

ఈక్విటీ మార్కెట్లతో పోలిస్తే బాండ్లలో జరిగే నష్టాలు లేదా రిస్కులు చాలా సైలెంట్. ఎందుకంటే అవి భారీ నష్టాన్ని మిగుల్చుతాయి. కాబట్టి క్రెడిట్ రిస్క్, లిక్విడిటీ, ద్రవ్యోల్బణం మరియు వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులను బేరీజు వేసుకుని.. మీ బడ్జెట్‌కు అనుగుణంగా బాండ్స్‌లో పెట్టుబడి పెట్టండి.

- Advertisement -