పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (BJP) ఊహించని రీతిలో దూసుకుపోతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావాలన్న ఆశలపై బీజేపీ గండికొట్టింది. బెంగాల్ రాజకీయాల్లో ‘ఖేలా హోబే’ (ఆట మొదలైంది) నినాదం ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా మారినట్లు కనిపిస్తోంది.
భారత ఎన్నికల సంఘం (ECI) తాజా ట్రెండ్స్ ప్రకారం, బీజేపీ ఇప్పటికే 156 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ మ్యాజిక్ ఫిగర్ (148) ను దాటేసింది. మరోవైపు టీఎంసీ కేవలం 86 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. బెంగాల్‌ను దశాబ్దాల పాటు పాలించిన కమ్యూనిస్టులు, గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న టీఎంసీ కోటను బద్దలు కొట్టి.. బీజేపీ మొదటిసారిగా ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది.
తన అద్భుత ప్రదర్శనతో ఉత్సాహంగా ఉన్న విపక్ష నేత, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి మాట్లాడుతూ.. బీజేపీ 180 కంటే ఎక్కువ స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది” అని ధీమా వ్యక్తం చేశారు. టీఎంసీ పరిస్థితిపై వ్యంగ్యంగా స్పందిస్తూ.. వారిని ఏడవనివ్వండి.. అంతా అయిపోయింది అని వ్యాఖ్యానించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో హిందువులంతా ఏకమయ్యారని, అందుకే బీజేపీకి ఈ విజయం దక్కుతోందని సువేందు పేర్కొన్నారు. మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్‌పూర్ వంటి ప్రాంతాల్లో మాత్రమే ముస్లిం ఓటర్ల వల్ల టీఎంసీ, కాంగ్రెస్ నిలిచాయని ఆయన విశ్లేషించారు.స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బెంగాల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యధికంగా 92.47% ఓటింగ్ నమోదైంది. ఈ భారీ ఓటింగ్ అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2021లో 213 సీట్లతో గెలిచిన టీఎంసీ, ఈసారి డబుల్ డిజిట్‌కు పడిపోయే ప్రమాదంలో ఉంది.ప్రస్తుతానికి బెంగాల్ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. కాషాయ జెండాలతో కోల్‌కతా వీధులు నిండిపోయాయి.
ALso Read:బెంగాల్ గడ్డపై కమలం జోరు..మమతకు షాక్!

