పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో ఈసారి దక్షిణ బెంగాల్ ప్రాంతం నిర్ణయాత్మక పాత్ర పోషించింది. గత 15 ఏళ్లుగా మమతా బెనర్జీకి వెన్నెముకగా నిలిచిన ఈ ప్రాంతంలో, ఇప్పుడు బీజేపీ భారీగా ఓట్లు మరియు సీట్లను కొల్లగొట్టింది. ఫలితంగా బెంగాల్ పీఠంపై టీఎంసీ పట్టు సడలింది.దక్షిణ బెంగాల్‌లోని కోల్‌కతా, హౌరా, సౌత్ 24 పరగణాల వంటి ప్రాంతాల్లో టీఎంసీకి తిరుగులేదని భావించినప్పటికీ, తాజా ఫలితాలు వేరేలా ఉన్నాయి. ముఖ్యంగా ‘డైమండ్ హార్బర్’ వంటి కీలక నియోజకవర్గాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచారు.
దక్షిణ బెంగాల్‌పై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ నేత సువేందు అధికారి వ్యూహం ఫలించినట్లు కనిపిస్తోంది. “హిందూ ఓట్ల ఏకీకరణ” మరియు “అవినీతి వ్యతిరేక నినాదం” ఈ ప్రాంతంలో టీఎంసీ ఓటు బ్యాంకుకు పెద్ద గండి కొట్టాయి. గతంలో తృణమూల్ వెంటే ఉన్న గ్రామీణ దక్షిణ బెంగాల్ ఓటర్లు, ఈసారి ఉద్యోగ నియామకాల కుంభకోణాలు మరియు శాంతిభద్రతల సమస్యల నేపథ్యంలో బీజేపీ వైపు మొగ్గు చూపారు.
Also Read:బెంగాల్ గడ్డపై కమలం జోరు..మమతకు షాక్!
కోల్‌కతా మరియు పరిసర ప్రాంతాల్లో ఆర్.జి. కర్ ఆస్పత్రి ఘటనపై జరిగిన ఆందోళనలు టీఎంసీకి వ్యతిరేకంగా మారాయని, ఇది పట్టణ ఓటింగ్‌లో స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.ప్రస్తుత కౌంటింగ్ ట్రెండ్స్ ప్రకారం, బీజేపీ 180 కంటే ఎక్కువ స్థానాల్లో దూసుకుపోతోంది. అందులో సగానికి పైగా సీట్లు దక్షిణ బెంగాల్ నుండే ఉండటం గమనార్హం. 2021లో కేవలం ఉత్తర బెంగాల్‌కే పరిమితమైన బీజేపీ, ఇప్పుడు దక్షిణ బెంగాల్‌ను కూడా తన వశం చేసుకుని బెంగాల్ గడ్డపై కాషాయ జెండా ఎగురవేసేందుకు సిద్ధమైంది.

