కాంగ్రెస్ సంబరాలు..10 ఏళ్ల నిరీక్షణకు తెర

8
- Advertisement -

కేరళ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) మ్యాజిక్ ఫిగర్‌ను దాటేయడంతో ఆ పార్టీ అగ్రనేతలు సంబరాల్లో మునిగిపోయారు. గత పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న యూడీఎఫ్, ఈసారి భారీ విజయంతో మళ్ళీ పీఠాన్ని దక్కించుకోబోతోంది.

తిరువనంతపురంలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల, శశి థరూర్, సన్నీ జోసెఫ్ తదితరులు కేక్ కట్ చేసి విజయోత్సవాలను జరుపుకున్నారు. నేతలందరూ ఒకరినొకరు కౌగిలించుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

మొత్తం 140 స్థానాలకు గాను యూడీఎఫ్ 91 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇందులో కాంగ్రెస్ పార్టీ 58 స్థానాల్లో, మిత్రపక్షం ముస్లిం లీగ్ (IUML) 22 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

ప్రజలు మార్పును కోరుకున్నారు. పదేళ్ల అస్తవ్యస్త పాలన తర్వాత ప్రజలు కొత్త తరహా రాజకీయాలను ఆహ్వానిస్తున్నారు అని శశి థరూర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న LDF కేవలం 40 స్థానాలకే పరిమితమైంది. అయితే, ఇది ప్రారంభ ట్రెండ్ మాత్రమేనని, కౌంటింగ్ ముగిసేసరికి ఫలితాలు మారతాయని సీపీఐ(ఎం) నేత ఎం.ఏ. బేబీ ఆశాభావం వ్యక్తం చేశారు.

కేరళ రాజకీయాల్లో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతుందనే సంప్రదాయాన్ని గత ఎన్నికల్లో పినరయి విజయన్ చెరిపివేశారు. అయితే, ఈసారి ఓటర్లు మళ్ళీ పాత సంప్రదాయాన్నే కొనసాగిస్తూ కాంగ్రెస్ కూటమికి పట్టం కట్టినట్లు కనిపిస్తోంది.

Also Read:బెంగాల్ గడ్డపై కమలం జోరు..మమతకు షాక్!

- Advertisement -