ఉత్తరాఖండ్లో సంచలనం సృష్టించిన ఘటనలో రిటైర్డ్ ఆర్మీ బ్రిగేడియర్ మృతి అనంతరం ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. రాష్ట్రంలో నేరాలపై ఉక్కుపాదం మోపాలని సీఎం ఆదేశించారు. ఎంకే జోషి (74) అనే రిటైర్డ్ ఆర్మీ బ్రిగేడియర్ డెహ్రాడూన్లో సోమవారం ఉదయం కాల్పుల్లో మృతి చెందారు. ఓ కారులో ఉన్న వ్యక్తి మరో వాహనంపై కాల్పులు జరిపిన సమయంలో బుల్లెట్ తగిలి ఆయన ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటన నేపథ్యంలో, ఉత్తరాఖండ్ పోలీసులు “ఆపరేషన్ ప్రజార్” పేరిట ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. రాష్ట్ర రాజధానిలో చట్టసవ్యస్థను కట్టుదిట్టం చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు.పుష్కర్ సింగ్ ధామి మాట్లాడుతూ…రాష్ట్రంలో చట్టవ్యవస్థపై ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.పోలీసులకు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని, నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తులపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రాధాన్యత అని, నిర్లక్ష్యం చూపిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పోలీసుల ప్రకారం, ఈ ఘటనకు రోడ్డు రేజ్ కారణం కాదని స్పష్టం చేశారు. నగరంలోని ఓ క్లబ్లో జరిగిన గొడవ కారణంగా ఈ కాల్పులు జరిగినట్లు తెలిపారు.స్కార్పియో వాహనంలోని వ్యక్తులు క్లబ్ బయట వేచి ఉండి, ఫార్ట్యూనర్ వాహనాన్ని వెంబడించి కాల్పులు జరిపారు. ఈ సమయంలో ఉదయం నడకకు వెళ్లిన బ్రిగేడియర్ జోషికి బుల్లెట్ తగిలింది.
Also Read:డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మోసం!
ఈ కేసులో ఇప్పటివరకు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నలుగురిని పట్టుకునేందుకు ఏడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.

