ఇంట్లో ప్రార్థన సమావేశాలు నిర్వహించడానికి ముందస్తు అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది ఛత్తీస్‌గఢ్ హైకోర్టు. చట్ట ఉల్లంఘనలు జరగనంత వరకు అధికారులు జోక్యం చేసుకోకూడదని పేర్కొంది. ఒకే న్యాయమూర్తి బెంచ్‌గా విచారణ చేసిన జస్టిస్ నరేష్ కుమార్ చంద్రవంశీ, పోలీసులు ఇద్దరు పిటిషనర్లకు జారీ చేసిన నోటీసులను రద్దు చేశారు. అలాగే, వారి పౌరహక్కుల్లో జోక్యం చేసుకోవద్దని అధికారులకు ఆదేశించారు.
ఈ కేసు గోధ్నా గ్రామంకు చెందిన ఇద్దరు బంధువులకు సంబంధించినది.వారు 2016 నుంచి తమ ఇంటి మొదటి అంతస్తులో ప్రార్థన సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారి వాదన ప్రకారం, ఈ సమావేశాల వల్ల ఎలాంటి అశాంతి లేదా చట్ట విరుద్ధ చర్యలు జరగలేదు. అయినప్పటికీ, పోలీసులు భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS) 2023లోని సెక్షన్ 94 కింద నోటీసులు జారీ చేశారు.
ప్రారంభంలో గ్రామ పంచాయతీ నుంచి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికేట్’ (NOC) పొందినప్పటికీ, తరువాత ఒత్తిడితో అది రద్దు చేసినట్లు పిటిషనర్లు తెలిపారు.ప్రభుత్వ తరఫున న్యాయవాది శోభిత్ మిశ్రా, పిటిషనర్లపై గతంలో క్రిమినల్ కేసులు ఉన్నాయని, వారు అనుమతి తీసుకోకపోవడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారని వాదించారు.
కోర్టు స్పష్టంగా తెలిపింది..
వ్యక్తిగత ఇంట్లో ప్రార్థన సమావేశాలు నిర్వహించడానికి ప్రత్యేక అనుమతి అవసరం లేదు
ఎలాంటి చట్ట ఉల్లంఘనలు జరగకపోతే అధికారులు జోక్యం చేసుకోలేరు
శబ్ద కాలుష్యం లేదా శాంతిభద్రత సమస్యలు ఉంటే మాత్రమే చర్యలు తీసుకోవచ్చు
పిటిషనర్లు తమ భూమి యజమానులు. వారి ఇంట్లో ప్రార్థనలు నిర్వహించడాన్ని నిరోధించే ఎలాంటి చట్టం లేదు అని కోర్టు పేర్కొంది.
Also Read:డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మోసం!

