దేశంలో డిజిటల్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. “డిజిటల్ అరెస్ట్” పేరుతో ప్రజలను భయపెట్టి డబ్బులు దోచుకుంటున్న అంతర్జాతీయ ముఠా గుట్టు రట్టైంది. కాంబోడియా, మయన్మార్, వియత్నాం కేంద్రంగా పనిచేస్తున్న ఈ గ్యాంగ్ వెనుక చైనా దేశీయుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
విశాఖలో ఒక రిటైర్డ్ ఉద్యోగిని లక్ష్యంగా చేసుకున్న మోసగాళ్లు, కర్ణాటక క్రైమ్ డిపార్ట్‌మెంట్ పోలీసులమని చెప్పి బెదిరించారు. బాధితుడి పేరుపై వచ్చిన కొరియర్‌లో డ్రగ్స్ ఉన్నాయని నమ్మబలికి, అతడిని తీవ్ర ఒత్తిడికి గురిచేశారు. దీంతో భయపడిన బాధితుడు, మోసగాళ్లు చెప్పినట్లుగా దశల వారీగా మొత్తం రూ.1.05 కోట్లు వారి ఖాతాలకు బదిలీ చేశాడు. అంతేకాకుండా, డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా మరింత సొమ్ము ఇవ్వాలని దుండుగులు ఒత్తిడి కొనసాగించారు.
కొంతకాలానికి అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఈ కేసులో భాగంగా స్థానికంగా పనిచేస్తున్న ఏజెంట్లు సూర్య శ్రవణ్, సాయి దీపక్, రాజేష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.6 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ మోసగాళ్లు విదేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తూ, భారత్‌లో ఏజెంట్లను నియమించుకుని డబ్బులు సేకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ నేరాల్లో కొత్త పద్ధతులతో ప్రజలను మోసం చేస్తున్నారని అధికారులు తెలిపారు.ప్రజలు అపరిచిత కాల్స్, వీడియో కాల్స్ ద్వారా వచ్చే బెదిరింపులను నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు. పోలీసులమని చెప్పి డబ్బులు అడిగితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు.
Also Read:కర్ణాటకలో నీటి కొరత ముప్పు!
డిజిటల్ అరెస్ట్ వంటి కొత్త మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ మోసాల పద్ధతులు కూడా మారుతున్నాయి. కాబట్టి అప్రమత్తతే రక్షణ అనే విషయాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

