ఆసీస్‌ ఔట్.. బంగ్లాదేశ్ ఇన్‌

201
Champions Trophy 2017, England vs Australia
Champions Trophy 2017, England vs Australia
- Advertisement -

చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా కథ ముగిసింది. అడుగడుగునా వరుణుడు అడ్డుకోవడం.. ఆడిన ఒక్క మ్యాచ్‌లో కూడా ఓటమిపాలవడంతో ఒక్క విజయం కూడా లేకుండానే ఆస్ట్రేలియా ఇంటిదారి పట్టింది. సెమీస్ కు వెళ్లాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ లో ఇంగ్లండ్ తో పోటీ పడ్డ మ్యాచ్ ని సైతం వరుణుడు అడ్డుకోవడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతిన 40 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలిచినట్టు అంపైర్లు ప్రకటించడంతో ఆస్ట్రేలియా కథ ముగిసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 9 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఫించ్‌ 68, స్మిత్‌ 56, ట్రావిస్‌ హెడ్‌ 71 పరుగులు చేశారు. తరువాత 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో తొలిసారి ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. ఆపై ఆట తిరిగి ప్రారంభమయిన తరువాత మోర్గాన్‌, స్టోక్స్‌ విరుచుకుపడటంతో, 20 ఓవర్లకే 126 పరుగులు సాధించి, వర్షం పడ్డా గెలిచేందుకు కావాల్సిన పరుగులను సాధించింది. ఆపై మోర్గాన్ అవుట్ అయినా, స్టోక్స్, తన జోరును కొనసాగించి సెంచరీ సాధించాడు.

stokes

ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 204/4 స్కోరుతో గెలుపు ముంగిట నిలిచిన సమయంలో వర్షం కారణంగా ఆట ఆగిపోయింది. దాంతో, డక్‌వర్త్‌ పద్ధతిలో ఇంగ్లండ్‌ లక్ష్యాన్ని 40.2 ఓవర్లలో 200 పరుగులు నిర్దేశించారు. అప్పటికే ఇంగ్లిష్‌ టీమ్‌ 40 పరుగుల ముందంజలో నిలువడంతో ఆ జట్టునే విజయం వరించింది. స్కోరు మెరుగ్గా ఉండటంతో గెలిచినట్టు ప్రకటించారు. దీంతో చాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ – ఏ నుంచి ఇంగ్లండ్ తో పాటు, న్యూజిలాండ్ పై చిరస్మరణీయమైన విజయం సాధించిన బంగ్లాదేశ్ సెమీస్ కు వెళ్లింది.

అయితే ఈ మ్యాచ్ ని ఆస్ట్రేలియా వాసులు ఎంత ఆసక్తిగా చూశారో, కోట్లాది మంది బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులు అంతకు మించిన ఆసక్తితో చూశారు. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓడిపోతే బంగ్లాదేశ్ సెమీస్ కు వెళ్లనుండటమే ఇందుకు కారణం. వారి కోరిక నెరవేరడంతో బంగ్లా అభిమానులు పండగ చేసుకున్నారు.

- Advertisement -