కేంద్రంలో ఈసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి ని గద్దె దించి తాము అధికారం చేపట్టాలని చూస్తోంది ఇండియా కూటమిలోని కాంగ్రెస్. ఇప్పటికే బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తూ ముందడుగు వేస్తోంది. ఇప్పటికే 26 పార్టీలను కలుపుకొని ఇండియా కూటమిని ఏర్పాటు చేసిన హస్తం పార్టీ మరిన్ని పార్టీలను కూడా కూటమిలో కలుపుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. అయితే కాంగ్రెస్ ను పిఎం అభ్యర్థి విషయంలో నెలకొన్న అసంబద్దత కాస్త కలవర పెడుతున్నట్లు కనిపిస్తోంది. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చూడాలని కాంగ్రెస్ ఆరాటపడుతోంది. .
కానీ కూటమిలోని మరికొంత మంది నేతలు కూడా పిఎం పదవిపై కన్నెశారు. ముఖ్యంగా నితిశ్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్ వంటి వారు ఇండియా కూటమిలో రాహుల్ గాంధీకి పోటీగా ఉన్నారు. దీంతో హస్తం పార్టీ దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది. ఎందుకంటే కూటమిలోని నేతలను సంప్రదించకుండా రాహుల్ ను పిఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. ఇండియా కూటమిలో చీలిక రావడం ఖాయం, ఇదే విషయాన్ని కాంగ్రెస్ ఎప్పటి నుంచో దృష్టిలో ఉంచుకుంది. అందుకే హస్తం పార్టీ చేస్తున్న ప్రచారల్లో ఎక్కడ రాహుల్ ను పిఎం అభ్యర్థిగా ప్రస్తావించడం లేదు హస్తం పార్టీ. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు.
కూటమిలో పిఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించిన చీలిక రావడం ఖాయమని స్వయంగా ఖర్గేనే ఒప్పుకోవడం గమనార్హం. మరి ఈ సస్పెన్స్ కు కాంగ్రెస్ ఎప్పుడు తెర దించుతుందంటే.. ఆఫ్టర్ ఎలక్షన్స్ అంటున్నారు హస్తం నేతలు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తే.. ఆ తరువాత పిఎం ఎవరనే దానిపై ఆలోచిస్తారట. ఈ విషయాన్ని స్వయంగా ఖర్గేనే చెప్పుకొచ్చారు. దీంతో ఎన్నికల్లో విజయం సాధించడం ఇండియా కూటమికి తప్పనిసరిగా మారింది. ఒకవేళ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికి పిఎం ఎన్నికలో రాహుల్ గాంధీకి ఇతర మిత్రపక్ష పార్టీల నుంచి ఎంతమేర మద్దతు దక్కుతుందనేది కూడా ప్రశ్నార్థకమే. మొత్తానికి పిఎం విషయంలో హస్తం పార్టీకి ముందు రోజుల్లో పెద్ద పరిక్షే ఎదురవబోతుందని చెప్పాలి.
Also read:కుమ్మక్కులు.. జిమ్మిక్కులు!