రాష్ట్రంలో మాతా శిశుమరణాలు తగ్గుముఖం పట్టాయన్నారు మంత్రి హరీశ్ రావు. హైదరాబాద్ ఎర్రమంజిల్‌లో 200 పడకల మాతా, శిశు సంరక్షణ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు హరీశ్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నిమ్స్‌కు అనుబంధంగా నిర్మిస్తున్న ఈ ఎంసీహెచ్ ఆస్పత్రిని రూ. 55 కోట్లతో 4 అంతస్తుల్లో 200 పడకలతో నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.
త్వరలోనే గాంధీలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ, నిమ్స్‌లో 200 పడకలు, అల్వాల్‌లో కూడా 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఏర్పడక ముందు మాతా మరణాలు ప్రతి లక్షకు 92 మరణాలు ఉండే.. దాన్ని 43కు తగ్గించగలిగాం అన్నారు.
మాతాశిశు మరణాలు తగ్గుముఖం పట్టి దేశంలో మూడో స్థానంలో ఉన్నామని, మొదటి స్థానానికి వెళ్లాల్సిన అవసరం ఉందని సూచించారు. డయాలసిస్ రోగులందరికి ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందిస్తున్నాం అన్నారు. డయాలసిస్ రోగులను కాపాడుకునేందుకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తున్నామన్న హరీశ్.. ఆసరా పెన్షన్లు, ఉచిత బస్ పాస్‌లను కూడా అందిస్తున్నాం అని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..