మీలో ఎవరైనా ఒక చెరువు తవ్వేందుకు డబ్బులు ఇస్తారా…అలా ఎంతమంది ఉంటారో చెప్పండి. కానీ ఒక మనిషి ఏకంగా 16 చెరువులను తవ్వి నీటి యోధుడిగా అందరి చేత పిలిపించుకున్నారు. అతను ఎవరో కాదు…కర్ణాటకలోని మాండ్యా జిల్లాకు చెందిన కామెగౌడ. పశువుల కాపరి అయిన కామెగౌడ మాలవల్లి తాలూకాలోని దసనదొడ్డి గ్రామంలో 16చెరువులను తొవ్వారు. నీటి యోధుడిగా పేరు తెచ్చుకున్న కామెగౌడ ఇటీవలే కన్నుమూశారు.
మాలవల్లి తాలూకాలో తనకు వచ్చిన ఆదాయం నుంచి కొన్ని సేవింగ్స్ చేసి.. ఆ డబ్బుతో అక్కడ ఉన్న కొండల్లో 16 చెరువులను తొవ్వించాడు. ఆ గుట్టలపై ఆయన మొక్కలను కూడా పెంచారు. వాటి సంరక్షణ కూడా ఆయనే చూసుకునేవారు.
2020లో జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఆ నీటి యోధుడిని విశేషంగా ప్రశంసించారు. చిన్న చిన్న చెరువులను నిర్మించడం వల్ల ఆ ఊరి నీటి సమస్యలను కామె గౌడ తీర్చినట్లు ప్రధాని మోదీ తన మన్‌కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడారు. అసాధారణ వ్యక్తిత్వం ఉన్న రైతు ఆయన అని కీర్తించారు. కామె గౌడ మృతి పట్ల సీఎం బసవరాజ్ బొమ్మై సంతాపం తెలిపారు. గౌడ మరణం బాధించినట్లు సీఎం బొమ్మై ట్వీట్‌లో తెలిపారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రయత్నించిన కామె గౌడకు రాష్ట్ర ప్రభుత్వం రాజ్యోత్సవ, బసవశ్రీ అవార్డులు అందజేసింది. కర్నాటక రాష్ట్ర ఆర్టీసీ ఆయనకు జీవిత కాల ఉచిత బస్సు పాస్‌ను కూడా కల్పించింది.