ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై గవర్నర్ తమిళిసై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అటవీ, పర్యావరణ,న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ రాజకీయ విమర్శలు చేయడం తగదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలతో గవర్నర్ ఏకీభవించాలని లేదని.. అయితే ప్రశ్నించే అధికారం మాత్రం ఆమెకు లేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ గారు గొప్ప రాజనీతిజ్ఞుడని, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిని ఎలా గౌరవించాలో ఆయనకు తెలుసని అన్నారు. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి గవర్నర్ పదే పదే రాజకీయాలు మాట్లాడుతూ… ఓ పార్టీకి లబ్ధి చేకూరే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రాజకీయాలలో జోక్యం చేసుకోవడం మానుకోవాలని సూచించారు.
గవర్నర్ తమిళిసై హోదాకు తగినట్లు ప్రవర్తించాలన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్ 14 ఏళ్లు పోరాడి సాధించిన రాష్ట్రాన్ని ఇష్టపడి అభివృద్ధి చేస్తున్నారు …గత మూడేళ్లలో గవర్నర్ గా మీరు సందర్శించిన ప్రాంతాలకు కేంద్రం నుండి తీసుకువచ్చిన నిధులు ఎన్ని ? అని ప్రశ్నించారు. మీరు సమస్యలు ఉన్నాయని వెళ్లిన ప్రాంతాలలో ఎన్ని సమస్యలు పరిష్కరించారు ?…గవర్నర్ పదవి అనేది రాజ్యాంగబద్దమైన హోదా.. దానిని మీరు హుందాగా ఉపయోగించుకోవాలన్నారు.
దేశంలో గవర్నర్ పదవి వార్షికోత్సవం నిర్వహించుకున్న ఏకైక గవర్నర్ తెలంగాణ గవర్నర్ గా మీరు మాత్రమే….దక్షిణాది రాష్ట్రాల సమావేశాలకు హాజరు కావడం అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగతం అన్నారు. వారి బదులు హోంమంత్రి హాజరయ్యారు…దానిని ప్రశ్నించడం గవర్నర్ గా మీకు తగదు అని సూచించారు.